కవాతుతో కదంతొక్కిన సేనాని.. జనాల్ని పోగేసి జగడం పెంచారా?

కవాతుతో కదంతొక్కిన సేనాని.. జనాల్ని పోగేసి జగడం పెంచారా?
x
Highlights

జనసైనికుల కవాతుతో ధవళేశ్వరం బ్యారేజీ ప్రాంతం మారుమ్మోగింది. టీడీపీ, వైసీపీపై పవన్ మండిపడ్డారు. జగన్‌ను ఎదుర్కునే శక్తి, ధైర్యం టీడీపీ లేదన్న...

జనసైనికుల కవాతుతో ధవళేశ్వరం బ్యారేజీ ప్రాంతం మారుమ్మోగింది. టీడీపీ, వైసీపీపై పవన్ మండిపడ్డారు. జగన్‌ను ఎదుర్కునే శక్తి, ధైర్యం టీడీపీ లేదన్న జనసేనాని.. జగన్‌ను ఎదుర్కునే సత్తా జనసేనకు ఉందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పెడితే, తమ సత్తా చూపిస్తామన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్‌ పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా.. కాటన్‌ వంతెనపై ఏర్పాటు చేసిన భారీ కవాతు ఉత్సాహంగా సాగింది. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు సుమారు రెండున్నర కిలో మీటర్ల మేర కవాతు జరిగింది. ఈ కవాతు సందర్భంగా రూపొందించిన పదా.. పద.. పద సాంగ్‌ జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఓపెన్‌టాప్‌ వాహనంలో.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ, పవన్ బహిరంగ సభకు చేరుకున్నారు‌. ఈ సందర్బంగా టీడీపీ, వైసీపీపై మండిపడ్డారు. సీఎం పదవి తనకు అలంకారం కాదన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లాగా వారసత్వం కాదని చెప్పారు. జగన్‌లా తండ్రి సీఎం గనక తాను సీఎం కావాలన్న వారసత్వం తనకు లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని లోకేశ్‌కు పంచాయతీరాజ్‌ ఇచ్చారని పవన్ విమర్శించారు. లోకేశ్‌కు పంచాయతీరాజ్‌ గురించి ఏం తెలుసు.. అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలు తనకు మూడో ఎన్నికలని.. ఆ అనుభవాన్ని తీసుకొని 2019 ఎన్నికలకు వెళ్తున్నట్టు పవన్‌ స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు నిత్యం చెప్పే, విజన్‌ 2020లో రెండు కోట్ల ఉద్యోగాలన్నారని.. ఆ ఉద్యోగాలు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. దశాబ్దాలుగా యువతలో ఆవేశం రగిలి రగిలి.. జనసేన ఆవిర్భావానికి కారణమైందని చెప్పారు. జనసేన ప్రజల పార్టీ అని.. తనకు ఏ పని అప్పగించినా త్రికరణశుద్ధిగా చేస్తానని పవన్ తెలిపారు. కవాతుకు ముందు, జనసేన అధినేత పవన్‌ కు పోలీసులు గట్టి షాకిచ్చారు. ధవళేశ్వరం బ్యారేజీపై తలపెట్టిన కవాతుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టంచేశారు. కవాతుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని, 10వేల మంది కంటే ఎక్కువ మందికి సభా ప్రాంగణం సరిపోదని తెలిపారు. అయినా, జనసేన పార్టీ మాత్రం కవాతుని నిర్వహించింది. సభను సక్సెస్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories