బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా?

బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా?
x
Highlights

బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. వారం రోజులుగా తీరిక లేకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ...

బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. వారం రోజులుగా తీరిక లేకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీయేకే పట్టం కట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

మోడీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీయేకు 300లకుపైగా సీట్లొస్తాయని ఢంకా బజాయించి చెబుతున్నా చంద్రబాబు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌ విడుదల కాగానే ఢిల్లీ నుంచి అమరావతి తిరిగొచ్చిన చంద్రబాబు పార్టీ నేతల్లో భరోసా నింపే పని చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఫాల్స్ అంటూ వందకు వెయ్యి శాతం ఏపీలో టీడీపీదే అధికారమంటూ ధీమాగా చెప్పారు. అనంతరం కోల్‌కత్తా వెళ్లి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై దీదీతో చర్చించిన చంద్రబాబు 23న ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపై మంతనాలు జరిపారు.

చంద్రబాబు మళ్లీ హస్తిన చేరుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మరోసారి ధర్నాకు రెడీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కింపు వంటి అంశాలపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌కు ముందు మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, లెఫ్ట్‌ పార్టీ నేతలు సీతారం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఎస్పీ, బీఎస్పీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతిలతో జరిపిన చర్చల వివరాలను ఢిల్లీలో నేతలకు వివరించారు.

మొత్తంగా చూస్తే ఇప్పటివరకూ చంద్రబాబు చర్చలన్నీ విభిన్నపార్టీలు, వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం వరకే పరిమితమయ్యాయి తప్పితే అంతకుమించి ఏమీ జరగలేదని తెలుస్తోంది. మరి, బీజేపీయేతర పక్షం ఏర్పాటు విషయంలో చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో, లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories