ఎగ్జిట్ పోల్స్ చూసి ఎగరవచ్చా?

ఎగ్జిట్ పోల్స్ చూసి ఎగరవచ్చా?
x
Highlights

అసలు ఫలితాలకు కొద్దిగా ముందుగా వచ్చే శాంపిల్ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్. సాధారణంగా సర్వేలన్నీ శాస్త్రీయంగా జరుగుతాయంటారు. అంటే.. ఎన్నికలు జరిగిన ...

అసలు ఫలితాలకు కొద్దిగా ముందుగా వచ్చే శాంపిల్ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్. సాధారణంగా సర్వేలన్నీ శాస్త్రీయంగా జరుగుతాయంటారు. అంటే.. ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని కొంత మందితో మాట్లాడి.. వారి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటన్నిటినీ క్రోడీకరించి, విశ్లేషించి సర్వే ఫలితాలను అందిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. కనిపించడానికి ఇది చాలా చిన్నదిలా కనబడుతుంది కానీ.. దీనిపై జరిగే కసరత్తు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇది పక్కన పెడితే, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిజల్ట్.. అసలు ఫలితాల్లో కూడా కనబడుతుందా అని ప్రశ్నించుకుంటే రెండు రకాల సమాధానాలు దొరుకుతాయి. దాదాపుగా అవే ఫలితాలు రావచ్చు.. అన్ని సార్లూ నిజం కావు. రెండు సమాధానాల్లోనూ ఎక్కడా కచ్చితంగా అనే జవాబు దొరకదు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు నమ్మొచ్చు అనేది లేక్కేసుకోవాలంటే.. 2014 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ని.. అపుడు వచ్చిన పోల్ రిజల్ట్ ని ఒకసారి చూడాలి. అపుడు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. మహా టీవీ, లగడపాటి సర్వేలు మాత్రమే టీడీపీకి అవకాశం ఉందని చెప్పాయి. చివరకు టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే, వాళ్ళు అంచనా వేసినన్ని సీట్లు టీడీపీకి రాలేదు. మెజార్టీకి కొంచెం ఎక్కువగా 107 సీట్లు వచ్చాయి. అపుడు టీడీపీ-బీజేపీ కూటమిగా పోటీచేశాయి.

ఇపుడు పరిస్థితులు మారాయి. టీడీపీ ఒంటరిగా పోరాటం చేసింది. జనసేన బరిలో ప్రత్యేకంగా నిలిచింది. మరిపుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకూ నిజమవుతాయన్నది అంత సులువుగా చెప్పగలిగేది కాదు. మీడియా పార్టీలు వారీగా విడిపోయిన పరిస్థితి ఉంది. అందుకేనేమో ఒకదానికి ఒకటి పొంతనలేని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అయితే, దాదాపుగా 90 శాతం మాత్రం కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. మూడు సర్వేలు మాత్రమే టీడీపీకి అధికారం రావచ్చని పేర్కొన్నాయి. సీట్ల విషయంలో లెక్కల్లో తేడాలు ఉండవచ్చునేమో కానీ.. వైసీపీ కి విజయం దాదాపు ఖాయం అయినట్టే కనిపిస్తోంది. లగడపాటి సర్వే టీడీపీకి అనుకూలంగా వచ్చినా.. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సర్వే విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. విశ్వాసనీయత లేని సర్వేగా దానికి ముద్రపడిపోయింది. తినబోతూ రుచులు తెలుసుకోవడం.. సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాకా కూడా సినిమా చూసి వస్తున్నవారిని సినిమా ఎలాగుందని అడగడం మనకి అలవాటే కదా. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ కోసం అంత హంగామా జరుగుతోంది. ఎటూ విషయం మరో రెండు రోజులు ఓపిక పడితే తేలిపోతుంది. ఈ సందర్భంగా 2014 వివిధ ఎగ్జిట్ పోల్స్ కు వాస్తవంగా వచ్చిన ఫలితాలకూ బేరీజు వేసుకోవడం సమంజసంగా ఉంటుంది.

- ఎన్డీటీవీ హంస సర్వేలో వైసీపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని, టీడీపికి 75 నుంచి 95 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. లోక్‌సభలో టీడీపీకి 13, వైసీపీకి 12 స్థానాలు వస్తాయని పేర్కొంది.

- మహా న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లోటీడీపీ-బీజేపీ కూటమికి 129, వైసీపీకి 42 సీట్లు వస్తాయని పేర్కొంది. లోక్‌సభలో టీడీపీకి 18, బీజేపీకి 3, వైసీపీకి 4 స్థానాలు వస్తాయని తెలిపింది.

- ఎన్టీవీ-నిల్సన్ సంయుక్త సర్వేలో వైసీపికి 129 నుంచి 133 సీట్లు వస్తాయని అంచనా వేశారు. టీడీపికి కేవలం 42 నుంచి 46 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. లోక్‌సభలో వైసీపీకి 23 నుంచి 25, టీడీపీ, కాంగ్రెస్‌లకు 3 నుంచి 5 సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది.

- లగడపాటి సర్వేలో టీడీపీ-బీజేపీ కూటమికి 115 నుంచి 125 సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. వైస్సార్‌సీపీకి 45 నుంచి 55 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. లోక్‌సభలో టీడీపీ-బీజేపీ కూటమికి 19-22 సీట్లు లభిస్తాయని అంచనా వేశారు.

వాస్తవ ఫలితాలు ఇవే..

మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమికి 107 సీట్లు, వైసీపీకి 66 సీట్లు లభించాయి. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ-బీజేపీలకు 16, వైఎస్సార్ సీపీకి 9 స్థానాలు దక్కాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories