ఖమ్మందే తొలి ఫలితం..

ఖమ్మందే తొలి ఫలితం..
x
Highlights

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి 35 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ...

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి 35 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో తక్కువ పోలింగ్‌ స్టేషన్లు ఉన్న ఖమ్మం ఫలితం మొదట వెలువడనుంది. ఇక 185 మంది బరిలో నిల్చిన నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో మాత్రం ఏకంగా 36 టేబుళ్లు ఏర్పాటుకు ఈసీ గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో లెక్కింపు రోజే ఫలితం వెలవడుతుందని అధికారులు వెల్లడించారు.

దేశం కౌంటింగ్‌ మూడ్‌లోకి వెళ్లింది. ఎగ్జిట్‌ ఫలితాల తర్వాత అందరి దృష్టి లెక్కింపు రోజు వెలువడే ఫలితాలపై పడింది. తెలంగాణలోని 17 స్థానాల్లో కౌంటింగ్‌ ప్రక్రియ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 35 కేంద్రాల్లో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రతీ కౌంటింగ్‌ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో రౌండ్‌కు 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. దీంతో రాష్ట్రంలోనే 14 వందలా 76 పోలింగ్‌ స్టేషన్లున్న ఖమ్మం పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఫలితం మొదట వెలువడనుందని చెబుతున్నారు. ఆ తర్వాత జహీరాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఫలితాలు వరుసగా వెలువడే అవకాశం ఉంది.

ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు సగటున 20 నుంచి 30 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమయం మరింత ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదని ఈసీ వర్గాలంటున్నాయి. అయితే ఈ సారి వీవీప్యాట్‌ స్లిప్పులను కూడా లెక్కించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈసీ అధికారులు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు వీవీప్యాట్ల ఓట్లను కూడా లెక్కిస్తారు. అయితే వాటిని ఈవీఎంల కౌంటింగ్‌ తర్వాతే లెక్కిస్తారు. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వాటిని సరిపోల్చుకున్న తర్వాతే ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితం ఆలస్యంగా వెలువడనుంది. ఈసీ తాజా ఆదేశాలతో ఇక్కడి కౌంటింగ్‌ కేంద్రాల్లో 36 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. బరిలో 185 మంది అభ్యర్థులుండటంతో లెక్కింపు నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన ఒక్కో అభ్యర్థికి నమోదైన ఓట్లను పరిశీలించి రికార్డు చేసేందుకు సగటున ఏడు నిమిషాలు తీసుకోనుంది. దీంతోపాటు 35 వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితం చాలా ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది.

మరోవైపు దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలోని ఎల్బీ నగర్, మేడ్చల్‌ అసెంబ్లీ స్థానాల పరిధిలోని 500 పైచిలుకు పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 30 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అత్యధిక ఓటర్లు, పోలింగ్‌ స్టేషన్లు ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories