logo

షేక్‌హ్యాండ్‌తో ముప్పే

షేక్‌హ్యాండ్‌తో ముప్పే

కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ.. అని ఊరికే అనలేదు మన పెద్దలు. సకల దేవతలు మన అరచేతిలోనే మనకు దర్శనమిస్తారు, అది ఎప్పుడంటే మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడే. కానీ.. ప్రపంచంలో 95 శాతం మందికి రాని పని ఏమిటో మీకు తెలుసా ? చేతులు కడుక్కోవటం. నమ్మలేని నిత్య సత్యం ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తేల్చిన లెక్క ఇది. రోగాలు శరవేగంగా వ్యాపించడానికి, అంటువ్యాధులు చెలరేగడానికి కారణం కూడా చేతులు శుభ్రంగా లేకపోవడమేనట. ప్రపంచంలో 20 లక్షల మంది చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతులు పట్టుకోవడంద్వారా పలు వ్యాధులు సోకేలా చేస్తోంది. రోగాలు రాకుండా మిమ్మల్ని సురక్షితంగా కాపాడేలా చేసే చేతులపై కాసింత జాగ్రత్త వహించండి. అదే మీకు శ్రీరామ రక్ష.

మరేం చేయాలి ?
చాలా సింపుల్.. మీరు ఏ పని చేయాలన్నా ముందు చేతులు కడుక్కోండి, పని అయిపోయాక కూడా చేతులు కడుక్కోండి. అప్పుడు కంటికి కనిపించని సూక్ష్మజీవులేవీ మీదరి చేరవు సరికదా, రోగాలపాలు చేయదు కూడా. బ్యాక్టీరియాలు, వైరస్‌లన్నింటికీ మీ అరచేతులు, చేతి వేళ్లే పుట్టిల్లు. జనరల్‌గా టాయ్‌లెట్ వెళ్లినప్పుడు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కునే అలవాటు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు సిటీ ప్రజల్లో చాలామందికి లేదు. పిల్లల డైపర్లు మార్చిన తరువాత కూడా ఆ చేతికి ఏమీ అంటుకోలేదని దులుపుకోవడం పరిపాటి. ఇక మనం వాడే ఏటీఎంలు, స్వైపింగ్ కార్డులు, ఆఖరుకి విజిటింగ్ కార్డులు, చిల్లర నాణేలు, కరెన్సీ, ఆఫీసు-ఇంట్లో వాడే కంప్యూటర్ కీ బోర్డులు.. మౌస్‌లు, ఇళ్లలో తలుపుల గడియులు.. ఇలా ఒక్కటేమిటి..మనం చేతులతో ముట్టుకునే ప్రతి వస్తువుద్వారా సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదముంది.

షేక్‌హ్యాండ్‌తో ముప్పే
ఇక దగ్గు, జలుబువంటివాటితో బాధపడుతున్నవారితో షేక్ హ్యాండ్ తీసుకున్నారో మీ సంగతి గోవిందా. ఎందుకంటే ఆరోజు రాత్రిలోగా మీకు అది అంటుకోవడం ఖాయం. సంస్కారవంతంగా ఓ నమస్కారం పెట్టి ఊరుకోండి. అప్పుడు సగం రోగాలకు మీరు హ్యాండ్ ఇచ్చినట్టే. కళ్లు, నోరు, స్కిన్ అలర్జీలతోపాటు వాంతులు, విరోచనాలు కూడా రాకుండా మీరు నిరోధించే అవకాశం మీచేతుల్లోనే ఉంది. అందుకే మీరు, మీకు అయినవారు సదా చేతులు శుభ్రంగా కడుక్కునేలా మీరే జాగ్రత్త తీసుకోండి. ఇందులో ఎటువంటి మొహమాటానికి తావులేదు. మీరు అందరి బాగు కోరి చెబుతున్నారు కాబట్టి భయపడకుండా, ఏమనుకుంటారో అన్న సంకోచం లేకుండా చేతులు కడుక్కోమని మీవారందరికీ చెప్పండి.

రక్షణ వలయంలా హ్యాండ్ వాష్‌లు..
యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ చేతులు పరిశుభ్రంగా ఉండేలా చేయడంపై అవగాహన కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు కడుక్కోండి అంటూ పబ్లిసిటీ ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. రెండు చుక్కల హ్యాండ్ వాష్ మీకు రక్షణ వలయం అని మీరు గుర్తించేందుకు ఎన్నో సంస్థలు చేస్తున్న సర్కస్ మీ శ్రేయస్సు కోసమే. ఇది మీరు గుర్తిస్తే ఇక ఆసుపత్రికి పెద్దగా డబ్బు వెచ్చించాల్సిన అవసరం మీకుండదు. ఈ అవగాహనా కార్యక్రమాల కోసం విలువైన ప్రజాధనం నుంచి ఇంత భారీ బడ్జెట్‌లు ఏ సంస్థలూ కేటాయించాల్సిన ఆగత్యం ఉండదు. సామాజిక బాధ్యతతో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, గ్లోబల్ హ్యాండ్ హైజీన్ డే అంటూ చేతులు కడుక్కోవడంపై ఏకంగా అంతర్జాతీయ దినోత్సవాలను కూడా నిర్వహిస్తున్నది ఇందుకే.

చేతులు కడుక్కోవడం సామాజిక బాధ్యత అంటున్న వైద్యులు
బాలలకు చిన్నప్పటి నుంచే చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తే.. తరతరాలకు అది కొనసాగడం చాలా సులువు, అప్పుడు ప్రజారోగ్యం సురక్షితంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చేతులు కడుక్కోవడం చాలా సులభమైన అతి చిన్న పనే అయినా, దానిపై అవగాహన లేమితోనే రోగాల దరిద్రం చుట్టుకుంటోందని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ నవీన్ చంద్ర చెబుతున్నారు. టాయ్‌లెట్‌కు వెళ్లివచ్చిన మన చేతులపై 10 మిలియన్ వైరస్‌లు ఉంటాయని కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఉదయ్‌కుమార్ హెచ్చరిస్తున్నారు. ఒక గ్రాము మానవ మలంలో 10మిలియన్ వైరస్‌లతోపాటు ఒక మిలియన్ బ్యాక్టీరియా కూడా ఉంటుందని ఈయన గుర్తు చేస్తున్నారు. దీనికి విరుగుడు హ్యాండ్ వాష్ లేదా సబ్బుతో చేతులు కడుక్కుంటే సరి.

లైవ్ టీవి

Share it
Top