డెత్‌ పూల్స్‌గా మారుతున్న స్విమ్మింగ్‌ పూల్స్‌...ప్రాణాలమీదికి తెస్తున్న...

డెత్‌ పూల్స్‌గా మారుతున్న స్విమ్మింగ్‌ పూల్స్‌...ప్రాణాలమీదికి తెస్తున్న...
x
Highlights

స్విమ్మింగ్‌ పూల్స్‌.. డెత్‌ పూల్స్‌ గా మారుతున్నాయి. పసి ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈత కొడుతున్న చిన్నారులను అమాంతం మింగేస్తున్నాయి. వేసవిలో సరదాగా ఈత...

స్విమ్మింగ్‌ పూల్స్‌.. డెత్‌ పూల్స్‌ గా మారుతున్నాయి. పసి ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈత కొడుతున్న చిన్నారులను అమాంతం మింగేస్తున్నాయి. వేసవిలో సరదాగా ఈత నేర్చుకుందామనుకున్న చిన్నారులు జలసమాధి అవుతున్నారు. ఇటీవల నగరంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి.

సమ్మర్‌ క్యాంపుల పేరుతో ముఖ్యంగా హైదరాబాద్‌లో చాలా చోట్ల స్విమ్మింగ్‌ నేర్పిస్తున్నారు. దీంతో నగరంలోని చాలా మంది తమ చిన్నారులకు స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతను నేర్పిస్తున్నారు. అయితే సరైన సౌకర్యాలు లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యం వల్ల పసిప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. తాజాగా తారామతి భారాదర స్విమ్మింగ్‌ పూల్‌లో మరో చిన్నారి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం దు:ఖ సాగరంలో మునిగిపోయింది.

బంజారాహిల్స్‌ కు చెందిన 13 యేళ్ల ముషారఫ్‌ గోల్కొండ సమీపంలోని తారామతి బారాదర స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత నేర్చుకుంటున్నాడు. అయితే ప్రమాదవశాత్తు ఈత కొలనులో స్పృహ తప్పి పడిపోయాడు. దీన్ని గుర్తించిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అంతలోనే ముషారఫ్‌ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర సరైన సౌకర్యాలు లేవని చిన్నారులకు ఈత నేర్పేందుకు సరైన వసతులు కూడా కల్పించలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గత నెలలో గండిపేటలోని డ్యూ డ్రాప్‌ ఫామ్‌ హౌజ్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఫామ్‌ హౌజ్‌లో గెట్‌ టుగెదర్ పార్టీ జరుగుతుండగా నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రాజు-మమత కుమారుడు ప్రసన్నబాబు ఈత కొలనులో పడి మృతి చెందాడు.

మరోవైపు ఈ ఫిబ్రవరిలో హైదరాబాద్‌ శివరాంపల్లి దగ్గర్లోని ఏ టూ జెడ్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మహ్మద్‌ ఖాజా అనే విద్యార్థి మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈత నేర్చుకోడానికి వచ్చిన బాలుడు పూల్‌లో దిగి ప్రాణాలు కోల్పోయాడు. అయితే స్విమ్మింగ్‌ పూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అంతలోనే పూల్‌ యజమాని పరారయ్యాడు.

పూల్స్‌ యజమానులు సరైన వసతులు కల్పించకపోవడం కేవలం ఆదాయంపైనే దృష్టి సారించడంతో చిన్నారుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈత కొలను దగ్గర కోచ్‌లు ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉన్నా పట్టించుకోవడం లేదు. చిన్నారుల సరదాకు వారిని వదిలేయడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories