కాక రేపుతున్న అవిశ్వాస తీర్మానం

Submitted by arun on Fri, 07/20/2018 - 11:00
mc

ఇప్పుడు దేశం మొత్తం చూపు అవిశ్వాసంపైనే. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు చర్చకు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే యత్నాల్లో తలమునకలైన టీడీపీ చర్చ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

పార్లమెంటులోనూ..బయట ఒకటే చర్చ...అవిశ్వాసం ఏమవుతుందనే ఉత్కంఠ...విభజన హామీలను అమలుచేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. అవిశ్వాస తీర్మానం చర్చకు ముహూర్తం ఖరారైన తర్వాత ఢిల్లీ పరిణామలను నిశితంగా గమనిస్తున్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టడంతో పాటు చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీల్లో ఎవరు మాట్లాడాలి..ఏఏ అంశాలను ప్రసావించాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. 

అవిశ్వాసంపై జరిగే చర్చను టీడీపీ ఎంపీలలో ఎవరు ప్రారంభించాలనే అంశంలో చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం వైఖరిని ఎండగట్టిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కే అవిశ్వాస తీర్మానం చర్చను ప్రారంభించే అవకాశం ఇచ్చారు. నిజానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చర్చను ప్రారంభించాల్సి ఉన్నా ప్రతిష్ఠాత్మకమైన అంశం కాబట్టి అవిశ్వాసంపై చర్చను గల్లా జయదేవ్‌ ప్రారంభిస్తే బాగుంటుందని సీఎం నిర్ణయించారు. వెంటనే కేశినేని నానితో ముఖ్యమంత్రి మాట్లాడి ఒప్పించారు. గల్లా తర్వాత కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. 

అవిశ్వాసానికి మద్దతు సంపాదించే యత్నాల్లో భాగంగా సీఎం చంద్రబాబు దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు లేఖ రాశారు. లేఖతో పాటు విభజన చట్టం అమలుకు సంబంధించిన బుక్‌లెట్‌ను పంపారు. 2014 ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఏపీని బీజేపీ మోసం చేసిందన్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. విభజన హక్కుల సాధన కోసమే అవిశ్వాసం నోటీసు ఇచ్చామని వివరించారు ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే అవిశ్వాసం నోటీసులిచ్చామని అందరూ మద్దతు తెలపాలని చంద్రబాబు లేఖలో కోరారు. 

మరోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించి అవిశ్వాసానికి మద్దతు తెలపాలని విన్నవించారు. అందుకు కేజ్రీవాల్  సానుకూలంగా స్పందించి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలవాలని ఆప్ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయ్యారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు. టీడీపీ ఎంపీలకు విజ్ఞప్తికి అసద్ సానుకూలంగా స్పందించారు. 

English Title
How TDP emerged as key player in no-confidence motion against Modi govt

MORE FROM AUTHOR

RELATED ARTICLES