అమిత్‌షాకి ఊహించని షాక్

Submitted by arun on Wed, 06/06/2018 - 15:53
 Amith shah

బీజేపీ చీఫ్ అమిత్‌షాకి మిత్రపక్షం శివసేన ఊహించని షాక్ ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ఈ రోజు సాయంత్రం కలుసుకోనుండగా, శివసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. 2019 ఎన్నికల ముందు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉండదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ఇటీవలే జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ఉప ఎన్నికలో పార్టీ పనితీరును ప్రస్తావిస్తూ... ఈ పోలింగ్ ఫలితాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి పోస్టర్ కూడా తమకు అవసరం లేదని స్పష్టం చేశాయని అభిప్రాయం తెలియజేసింది. ఇరు పార్టీల అగ్రనేతల భేటీకి ముందు సామ్నా సంపాదకీయం రూపంలో శివసేన తన విధానం ఏంటో పరోక్షంగా తెలియజేసింది.‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్దతు కోసం భేటీ) ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇవాళ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరే నివాసం ‘మాతోశ్రీ’లో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ వేదికగా శివసేన బీజేపీ చీఫ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమిత్ షా హడావిడిగా ఎన్డీయే మిత్రపక్షాలతో ఎందుకు సమావేశం అవుతున్నారో చెప్పాలంటూ నిలదీసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయంపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
 
‘‘పాల్ఘడ్ ఉపఎన్నికల్లో శివసేన పార్టీ తన బలం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలోనే... 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంపర్క్ అభియాన్ అంటూ అమిత్ షా ప్రచారం మొదలు పెట్టారు..’’ అని సామ్నా తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల పర్యటనలో ఉంటే, అమిత్ షా దేశ పర్యటనలో ఉన్నారనీ... ఇలా బీజేపీ అంతర్జాతీయ ప్రచారం మొదలు పెట్టిందని ఎద్దేవా చేసింది. ‘‘దేశ ప్రజలతో బీజేపీకి సంబంధం (సంపర్క్) తెగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి...’’ అని సూచించింది. మే నెలలో 4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం 1 లోక్‌సభ, 1 అసెంబ్లీ స్థానంలో మాత్రమే గెలిచిందని శివసేన గుర్తుచేసింది.

English Title
Hours Before Amit Shah Comes Calling, Shiv Sena Mocks BJP Chief’s ‘Sampark for Samarthan’

MORE FROM AUTHOR

RELATED ARTICLES