logo

అందుకే నిజామాబాద్ కు దూరమవుతున్నారా.. ?

అందుకే నిజామాబాద్ కు దూరమవుతున్నారా.. ?

నిజామాబాద్ ఎంపీ సీటు పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలా ఉన్న ఆ నియోజక వర్గం 2014 తర్వాత టిఆరెస్ చేతిలోకి వెళ్లిపోయింది. మారుతున్న సమీకరణల్లో కాంగ్రెస్ నేత మధుయాష్కీ అదే నియోజక వర్గంనుంచి పోటీ చేస్తారా? లేక మారతారా? బిజెపి పోటీ లోకి దిగితే ఎలా ఉంటుంది?

మధు యాష్కీ రాహుల్ సేనలో కీలక నేతగా ఏఐసీసీ కార్యదర్శిగా కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న ఆయన ప్రస్తుతం రెండు పార్లమెంట్ స్ధానాలపై కన్నేశారు. ఐతే ఏ ఎంపీ సీటు నుంచి పోటీ చేయబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఐతే ఇక్కడ లేకుంటే అక్కడ అన్నట్లుగా సదరు నేత పావులు కదుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. 2004లో కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో దిగిన యాష్కీ తొలి ప్రయత్నంలో టీడీపీ అభ్యర్ధి యూసుఫ్ అలీపై భారీ మెజార్టీతో గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఒకే స్దానంలో గెలిచిన సందర్భంలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి గణేష్ గుప్తా పై 60,390 విజయకేతనం ఎగురవేశారు. సుమారు 10ఏళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా జిల్లా ప్రజలకు సేవ చేశారు. తెలంగాణ తరపున పార్లమెంట్ లో తన గళం వినిపించారు. ఐతే 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత చేతిలో లక్షన్నర ఓట్ల మెజార్టీతో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి అడపా దడపా కనపడినా ఏడాదిగా నియోజకవర్గానికి రావడమే మానేశారు. కర్ణాటక ఎన్నికల ఇంచార్జీగా బాధ్యతలు తీసుకోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇంతకీ మధుయాష్కీ నియోజక వర్గానికి రాకపోడానికి కారణాలేంటి?

ఈసారి నిజామాద్ ఎంపీ సీటుకు పోటీ హాట్ హాట్ గా సాగనుంది. ఓ వైపు సిటింగ్ ఎంపీ కవిత మరోసారి బరిలోకి దిగుతారన్న అంచనాలున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ అభ్యర్ధిత్వం దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. అందుకే టీఆర్ఎస్ - బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రజల్లోకి వెలుతున్నారు. బూత్ కమిటీ సమావేశాలతో కవిత పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుండగా పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలతో బీజేపీ నేత అరవింద్ వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అభ్యర్ధి ఎవరన్న దానిపై క్లారిటీ లేదు మధుయాష్కీ మళ్లీ పోటీ చేస్తారా..? లేక తన సొంత నియోజకవర్గం భువనగిరికి గురి పెడతారా అన్నది కార్యకర్తలకే అంచనా రావడం లేదు. భువనగిరి పార్లమెంట్ కు మధుయాష్కీ స్దానిక అభ్యర్ది కావడం బీసీ, గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీ ఈ సారి ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐతే ఆయన అనుచరులు మాత్రం నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారని చెబుతుండటం గమనార్హం.

ఏఐసీసీ కార్యదర్శిగా కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇంచార్జీగా రాహుల్ సేనలో కీలక పాత్ర పోషిస్తున్న మధుయాష్కీ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా నియోజకవర్గ ప్రజలకు ముఖం చాటేయడం పట్ల ప్రజల్లో- పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఆయన వచ్చే ఎన్నికల్లో భువనగిరిపై గురి పెడతారా? ఇందురూ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top