సాహో సర్కారు బడి...సర్కారు బడులకు జై కొడుతున్న తల్లిదండ్రులు

Submitted by arun on Sat, 06/30/2018 - 15:04

సర్కారు బడులంటే కూలిన గోడలు చెట్ల కింద చదువులు. పాఠాలు చెప్పని ఉపాధ్యాయులు ఎక్కువగా కనపడని విద్యార్థులు. ఇన్నాళ్లు గవర్నమెంట్  స్కూల్‌ అంటే మనకు తెలిసినవి ఇవే. కానీ ఇప్పుడా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్దికి చిరునామాలుగా మారాయి. చదువులు చెప్పడంలోనే కాదు ఫలితాలు సాధించడంలోనూ ప్రైవేటు స్కూళ్లకు సవాల్ విసురుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సర్కారు బడుల పురోగతిపై హెచ్ ఎం టీవీ ప్రత్యేక కథనం. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో సర్కారు బడులన్నీ అభివృద్దిలో దూసుకుపోతున్నాయి. సంగారెడ్డి, నారాయణఖేడ్, సిద్దిపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లోని పల్లెబడుల్లో చదువుకోడానికి విద్యార్థులు పోటీ పడుతున్నారు. అప్పటివరకు చదవిన ప్రైవేటు స్కూళ్లను వదిలేసి వస్తున్నారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తుండటం చదువుకునే పిల్లలతో టీచర్లు ఫ్రెండ్లీగా ఉండటం వంటి కారణాలతో స్కూళ్లల్లో స్ట్రెంత్ పెరుగుతోంది. పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఈ విద్యాసంవత్సరంలో ఏకంగా 72 మంది స్టూడెంట్స్  ప్రైవేటు స్కూళ్ల నుంచి చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీచర్లు చెబుతున్నారు. 

ఇటు సిద్దిపేట టౌన్‌లోని ఇందిరానగర్‌ పాఠశాలలో ప్రస్తుతం 540 మంది విద్యార్థులు చదువుతున్నారు. పరిమితికి మించిన విద్యార్థులుండటంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు విన్నవించారు. అడ్మీషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులు గొడవ పెట్టుకునే సందర్భాలున్నాయని నారాయణఖేడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. 630 మంది విద్యార్థులున్న ఈ స్కూల్‌లో తరగతి గదుల కొరత ఉందని అందుకె విద్యార్థులు వస్తున్నా అడ్మీషన్లు పూర్తయ్యాయని చెబుతున్నామంటున్నారు. మారిన పరిస్థితులు సర్కారు బడిపై ఆసక్తిని పెంచుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. 

ప్రైవేటు స్కూళ్లల్లో ఉండే సౌకర్యాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కనిపిస్తాయి. మెరుగైన వసతులతో పాటు డిజిటల్ క్లాసులతో సర్కారు బడులు  ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యాయి. పిల్లలు కూడా రకరకాల యాక్టివిటీస్‌లో ప్రతిభను కనబరుస్తున్నారు. 

ఎల్‌కేజీ నుంచే ఐఐటీ ట్రైనింగ్ అంటూ చెవులూదరగొట్టే కార్పొరేట్ స్కూళ్లకు ఇప్పుడు సాధారణ సర్కారు బడి సమాధానం చెబుతోంది. ప్రైవేటు స్కూళ్లల్లో చదివే పిల్లలకు ఏ మాత్రం తీసిపోని టాలెంట్‌తో సర్కారు బడి విద్యార్థులు సత్తా చాటుతున్నారు. చాలా స్కూళ్లల్లో డిజిటల్ క్లాసులు, మోడ్రన్ కిచెన్, వాటర్ ప్లాంట్ వంటి సౌకర్యాలను కలిపిస్తున్నారు. చిన్నారుల వికాసానికి ఆటపాటలు కూడా చాలా అవసరం. అలాంటి వాటిల్లో ప్రభుత్వ పాఠశాలలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రతీ స్కూల్‌కు అవసరమైన ప్లే గ్రౌండ్  ఉంటుంది. డే అండ్ వీక్లీ గేమ్స్ తో రకరకాల ఆటల్లో వారి ప్రతిభను వెలికితీస్తున్నారు. 

English Title
hmtv Special Story On Telangana Govt School Progress

MORE FROM AUTHOR

RELATED ARTICLES