యువకులను భయపెడుతున్న గుండెపోటు

Submitted by arun on Wed, 05/23/2018 - 12:28
Heart attack

గతంలో గుండెపోటు 50 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవలి పరిస్థితులు చూస్తుంటే..వృద్ధులకే గుండెపోటు వస్తుందనే నమ్మకం సడలి పోతోంది. చిన్న వయసులో కూడా గుండె పోటు రావచ్చనే భయం పట్టుంది,వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్న కేసులు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. 25 నుంచి 30 ఏళ్ల వయసువాళ్లూ హార్ట్ ఎటాక్ వస్తోంది. గుండెపోటు వచ్చినవారు ముసలివాళ్లయితే ఆ వయసులో సాధారణమే అనుకుంటాం. కానీ... యువకులకు కూడా గుండెపోటు వస్తోందని తెలిసి షాకవుతున్నాం. 

గుండెపోటు విషయంలో ప్రస్తుతం అన్ని అంచనాలూ తారుమారవుతున్నాయి. గుండె జబ్బుల గురించి ఇటీవలి అనుభవాలు, ఘటనలు పాత అభిప్రాయాల్ని మార్చేస్తున్నాయి. చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం, అది గుండెపోటుకు దారితీయడం ఇటీవల కాలంలో పెరిగిపోతూనే ఉంది. మన దేశంలో ప్రజల జీవనశైలే దీనికి ప్రధాన కారణం. నూనెలు, కొవ్వులు ఉండే ఆహార పదార్థాల వాడకం పెరగటం, శరీరానికి సరైన  వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సంబంధ మరణాలు పెరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు సంభవిస్తున్నాయనేది డాక్టర్లు చెబుతున్న మాట. 

నగరీకరణ పెరుగుతుండంతో జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. కాలంతోపాటు మన ఆహార వ్యవహారాల్లో, జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు తిండి, నిద్ర కరువయ్యాయి. శారీరక శ్రమ తగ్గి, మానసిక ఒత్తిడి పెరిగింది. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలు పెరిగాయి. వీటన్నిటి ఫలితంగా శరీరం ఒడుదొడుకులకు గురవుతూ, క్రమేపీ ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది. ఈ పరిస్థితి గుండె జబ్బులకు దారి తీస్తోంది. జీవన శైలిని మార్చుకోగలిగితే యువత గుండె సమస్యల నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

మనదేశంలో ప్రతీ సంవత్సరం పధ్నాలుగు లక్షల నుంచి పదహారు లక్షల మందికి గుండె జబ్బు బాధితుల జాబితాలో చేరుతున్నారు. చిన్న వయసువారు గుండె సంబంధ సమస్యలను ఎదుర్కోవడం వల్లనే ఈ సంఖ్య ఇంత వేగంగా పెరగడానికి ప్రధాన కారణం. చిన్న వయసులో గుండె జబ్బులకు రావడానికి ప్రధాన కారణం రక్తపోటు, డయాబెటిస్, ధూమపానం. చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం. దీంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాల వాడకం కూడా పెరుగుతోంది. ఇలాంటి కారణాల వల్లనే చాలామంది చిన్న వయసులో స్థూలకాయం అనుభవిస్తున్నారు. ఈ అంశం కూడా చిన్న వయసులో వచ్చే గుండె సమస్యలకు దారి తీస్తుందని పరిశోధనలు, సంఘటనలు రుజువు చేస్తున్నాయి. వీటితో పాటు ఒత్తిడి, వంశపారంపర్యత కూడా ఈ చిన్న వయసులో వచ్చే గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి

పనుల ఒత్తిడి, నిద్రవ్యవధి తగ్గడం వంటి అంశాల వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. వృత్తిలో భాగంగా ఎక్కువగా శారీరక అలసట లేకపోవడం వల్ల దేహానికి తగినంత వ్యాయామం ఉండటం లేదు. దీంతో చిన్న వయసులోనే గుండె సంబంధ సమస్యలు, గుండె పోటు వంటి సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది. దానికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా పెరుగుతున్న పని గంటలు, వ్యాయామం లేకపోవడం కారణాలు. జీవనశైలి, ఆహారపు క్రమం తప్పడం వల్ల ఆ ప్రభావం శరీరం మీద పడి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పుతోంది.
 

English Title
Heart attack to youth

MORE FROM AUTHOR

RELATED ARTICLES