ఎక్కడ చూసినా మొసళ్లే...

ఎక్కడ చూసినా మొసళ్లే...
x
Highlights

మంజీరా ప్రాంతంలో మొసళ్లు భయపెడుతున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ మొసలి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు....

మంజీరా ప్రాంతంలో మొసళ్లు భయపెడుతున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ మొసలి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలు నీటిలో ఉండాల్సిన మొసళ్లు జనారణ్యంలోకి ఎందుకొస్తున్నాయి? తీర ప్రాంత ప్రజల పరిస్థితేంటి?

మంజీరా తీర ప్రాంత ప్రజలను మొసళ్లు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఎటువైపు నుంచి ఏ మొసలి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. పొలాలకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. మంజీరా అభయారణ్యాన్ని దాటి పొలాల్లోకి గ్రామాల్లోకి వస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లో ఓ మొసలి రైతులను ఉరుగులు పరుగులు పెట్టించింది. అలాగే రేగోడ్ మండలం సాయిపేటలో చెరుకు తోటలోకి వచ్చిన మొసలిని చూసి కూలీలు పరుగులు తీశారు. మర్పల్లి మండలం బిల్‌కల్‌ దగ్గర పాడుబడిన బావిలోకి చేరిన మొసలి గ్రామస్తులను కలవరపెట్టింది. న్యాల్‌కల్‌ మండలం మిర్జాపూర్‌లోని మురుగు కాలువలో ప్రత్యక్షమైన మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు. అలాగే సంగారెడ్డిలో అర్ధరాత్రి జాతీయ రహదారిపైకి మొసలి రావడంతో వాహనదారులు హడలిపోయారు. ఇక పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఏకంగా మిషన్ భగీరథ పైప్‌లైన్‌లోకి వచ్చిన మొసలి చూసి కార్మికులు కలవరపడ్డారు. ఇలా ఒకటా రెండా ఎన్నో వరుస ఘటనల్లో మొసళ్లు జనాన్ని బెంబేలెత్తించాయి.

ప్రధానంగా మంజీరా అభయారణ‌్యం, సింగూరు ప్రాజెక్టు ప్రాంతాల్లో మొసళ్ల సంచారం ఉంటుంది. 36 కిలోమీటర్ల మేర విస్తరించిన మంజీరా అభయారణ‌్యాన్ని మొసళ్లకు ఆవాసా కేంద్రంగా గుర్తించారు. దాంతో సంగారెడ్డి మండలం కల్పగూర్ దగ్గర ప్రత్యేకంగా మొసళ్ల బ్రీడింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బ్రీడింగ్ సెంటర్లో పెంచిన మొసళ్లను మంజీరాలో వదలడంతోపాటు వాటి పరిరక్షణకు అటవీ అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం మంజీరా అభయారణ‌్యంలో దాదాపు 600 మొసళ్లు ఉన్నాయి. అయితే సింగూరు ప్రాజెక్టు ప్రాంతంలో అధికారికంగా మొసళ్ల గణన చేపట్టలేదు. దాంతో ఇక్కడ దాదాపు రెండు వేలకు పైగా మొసళ్లు ఉన్నట్లు అనధికారికంగా చెబుతున్నారు. మొసళ్లు ఇంత పెద్ద సంఖ్యలో ఉండబట్టే గతంలో వందల సంఖ్యలో పశువులు ఆహారంగా మారాయంటున్నారు.

ఇటు మంజీరా అభయారణ‌్యం పూర్తిగా ఎండిపోవడం అటు సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో మొసళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. పొలాల్లోకే కాకుండా ఏకంగా గ్రామాల్లోకే మొసళ్లు వచ్చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అక్కడక్కడా మొసళ్ల సంచారం ఉందని, ఒకవేళ గ్రామాల్లోకి మొసళ్లు వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు.

మంజీరా అభయారణ‌్యం, సింగూరు ప్రాజెక్టు ప్రాంతాల్లో నీరు లేకపోవడంతో మొసళ్ల మనుగడ ప్రశ్రార్ధకంగా మారింది. మంజీరాలో ప్రస్తుతమున్న కొద్దిపాటి నీటిని సైతం మిషన్ భగీరథ కోసం మోటార్ల ద్వారా తోడేస్తుండటంతో సమస్య మరింత తీవ్రతరమైంది. ఒకవైపు మొసళ్లు గ్రామాల్లోకి వస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తిపోతుంటే, మరోవైపు మొసళ్ల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతోందని వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే గత 15ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదని, నీటి సమస్య తీవ్రంగా ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories