వినోద పరిశ్రమలో విషాద వీచిక 'ఆర్తీ అగర్వాల్ '

వినోద పరిశ్రమలో విషాద వీచిక ఆర్తీ అగర్వాల్
x
Highlights

ఒక కల నెరవేరడానికి ఎంత కష్ట పడాల్సి వస్తుందో.. నెరవేరిన అదే కలని చిదిమేసుకోవడానికి ఒక్క తప్పు నిర్ణయం సరిపోతుంది. జీవితం మనకు పాఠాలు నేర్పినా...

ఒక కల నెరవేరడానికి ఎంత కష్ట పడాల్సి వస్తుందో.. నెరవేరిన అదే కలని చిదిమేసుకోవడానికి ఒక్క తప్పు నిర్ణయం సరిపోతుంది. జీవితం మనకు పాఠాలు నేర్పినా నేర్పకపోయినా.. ఒక్కోసారి మన జీవితమే విషాదపు పాఠంగా ప్రజల ముందు మిగిలిపోతుంది. సినిమా తారల జీవితాలు ఇందుకు చాల ఉదాహరణలుగా మిగిలిపోయాయి. అందరికీ వినోదాన్ని పంచి.. ఉన్నతమైన రంగుల జీవితాన్ని సాధించి.. విపరీతమైన జనాభిమానాన్ని సొంతం చేసుకుని.. వీటన్నిటికోసం కాలంతో పోటీపడి పరుగులు తీస్తారు సినీ తారలు. ఒక్కసారి స్థాయి అందుకున్న తరువాత ఎదురయ్యే ఓటమిని తట్టుకునే శక్తిని చాలా మంది అలవర్చుకోలేరు. దాంతో ఒక్కోటిగా నిర్మించుకున్న తమ రంగుల సామ్రాజ్యం.. ఒక్కసారే కుప్పకూలిపోతుంటే.. భరించలేక.. సామాన్య జీవితం గడపలేక.. నలిగిపోయి.. విషాదకర జీవితాన్ని అనుభవిస్తారు. సరిగ్గా అలాంటి విషాద కథే సినీ నటి ఆర్తీ అగర్వాల్ కథ. ఈరోజు (జూన్ 6) ఆమె వర్థంతి ఈ సందర్బంగా ఆమె గురించి..

'ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని' అంటూ వెంకటేష్ సరసన మెరిసిన తారను చూసి తెలుగు ప్రేక్షక లోకం మరో అందాల హీరోయిన్ దొరికిందని సంబరపడిపోయారు. ఆలా ఒక్క సినిమా తోనే ఆర్తీ అగర్వాల్ తెలుగు తెరపై మెరిసిపోయింది. ఆమె తండ్రి శశాంక్‌ అగర్వాల్‌ వ్యాపారంలో స్థిరపడిన శ్రీమంతుడు. పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు న్యూజెర్సీలోనే చెల్లెలు ఆదితి అగర్వాల్‌తో కలిసి చదువుకుంది ఆర్తి. నటుడు, నిర్మాత సునీల్‌శెట్టి ఓసారి అమెరికా వెళ్లినప్పుడు ఆర్తిని చూసి... ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా నగరాల్లో ఆమెతో నృత్య ప్రదర్శనలు ఇప్పించాడు. ఆ కార్యక్రమాలకు బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సునీల్‌శెట్టితో పాటు బిగ్‌-బి కూడా ఆర్తి ప్రదర్శనకు ముచ్చటపడి బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అలా ఆర్తికి మంచి నటిగా ఎదగాలని కలలు మొదలయ్యాయి. పదహారేళ్ల వయసులో భారతదేశానికి వచ్చింది ఆర్తి. 2001లో నిర్మాత రాజీవ్‌షా, జోయ్‌ అగస్టీన్‌ దర్శకత్వంలో నిర్మించిన బాలీవుడ్‌ సినిమా 'పాగల్‌పన్‌'లో అయిదుగురు అన్నదమ్ముల గారాల చెల్లెలు రోమాగా నటించింది. అది ఆమె తెరంగేట్రం..

సరిగ్గా ఇదే సమయంలో త్రివిక్రమ్ రచయితగా స్రవంతి కిషోర్, ఉదయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ తో ఓ సినిమా చేయాలని స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారు. ఈ సమయంలో ఆర్తి వారికి నచ్చింది. అంతే వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావంటూ జత కట్టే ఛాన్స్ దొరికింది. ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో ఒక్కసారే ఆర్టీకి స్టార్ డం వచ్చేసింది. ఇక అటు తర్వాత వెంటనే తరుణ్ తో నువ్వులేక నేను లేను చేసింది. అది కూడా సూపర్ హిట్. ఇక ఆమె కెరీర్ రివ్వున దూసుకుపోయింది. యువ హీరోల పక్కన హీరోయింగ్ గా చేస్తూనే పెద్ద హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి తో ఇంద్ర సినిమాలో ఆమె పాత్రకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. జూనియర్ ఎన్ఠీఆర్ తో అల్లరి రాముడు, మహేష్ బాబుతో బాబీ, రవితేజ తో వీడే, బాలకృష్ణ తో పల్నాటి బ్రహ్మనాయుడు ఇలా వరుసగా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించింది. ఆమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు హిందీలో దబ్ చేశారు. అవన్నీ కూడా ఆమెకు బాలీవుడ్ లో మంచిపేరును తెచ్చాయి. ఇది ఆమె విజయగాథ.

వరుస హెట్లతో ఒక స్థాయికి చేరిన ఆమె.. ఒక యువహీరోతో ప్రేమలో పడింది. ఆ హీరో కోసం సినిమాల్ని నిర్లక్ష్యం చేసింది. అంతే.. ఆమె కు అవకాశాలు తగ్గిపోయాయి. చిన్న వయసులోనే వచ్చిన స్టార్ డం.. కరిగిపోవడం.. మరోపక్క ప్రేమ భగ్నం కావడం.. ఆమెను క్రుంగ తీశాయి. టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చివరి నిమిషంలో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి చేరిస్తే బతికి బట్టకట్టింది. కొన్ని రోజులకు బాధల నుంచి తేరుకుని సునీల్ తో అందాల రాముడు సినిమాలో హీరోయింగ్ చేసింది. ఈ సినిమా హిట్ అయినా ఆమెకు అవకాశాలు రాలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆర్తి మాట్లాడుతూ "వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పుడు, పిచ్చిగా ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవాలనే ధ్యాసలో వచ్చిన అవకాశాలను కాలరాసుకున్నాను" అని చెప్పింది. కొంతకాలం తర్వాత తల్లిదండ్రుల సలహా మేరకు అమెరికాలో బ్యాంక్‌ ఉద్యోగం చేస్తున్న ఉజ్వల్‌ కుమార్‌ను హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో 2007 నవంబరు 21న వివాహమాడింది. హరియాణాకు చెందిన ఉజ్వల్‌ కుమార్‌ కుటుంబీకులు ఆర్తి కుటుంబానికి దూరపు బంధువులు. పెళ్లి చేసుకునే సమయంలో ఆర్తి సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన 'గోరింటాకు' సినిమాలో నటిస్తోంది. ఆర్తి-ఉజ్వల్ వివాహ జీవితం ఎంతో కాలం నిలువలేదు. విడాకులు తీసుకుంది.

ఆర్తి పెళ్లయ్యాక బాగా బరువు పెరిగింది. సినిమా అవకాశాలు రావడం మానేశాయి. లైపోసక్షన్‌ చేయించుకుంటే బరువు తగ్గడమే కాకుండా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు దూరమవుతాయని భావించిన ఆమె... అమెరికా వెళ్లి న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీ ఆసుపత్రిలో చేరి ఆపరేషన్‌ చేయించుకుంది. అదే రోజు రాత్రి ఆర్తి నటించిన 'రణం-2' సినిమా విడుదలైంది. ఆ తర్వాత గుండె పోటుకు గురై 2015 జూన్‌ 6న ప్రాణాలు విడిచింది.శివనాగు దర్శకత్వంలో 'జంక్షన్‌లో జయమాలిని' సినిమాలో ఆర్తి ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. అప్పుడు భరత్‌ పారేపల్లి 'నీలవేణి' చిత్రంలో ఆర్తి నటిస్తోంది. "చూస్తుండండి. నేను జూన్‌ 20న స్లిమ్‌గా అమెరికా నుంచి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తా. షూటింగ్ పెట్టుకోండి" అని చిత్రబృందంతో చెప్పి వెళ్లిన ఆర్తి అనూహ్యంగా మృతి చెందింది. అలా ఆర్తి ఎంతో ఎదిగి అంతలోనే మాయమైపోయింది. ఇది ఆమె విషాదగాథ.

ఆర్తీ అగర్వాల్ జీవితం యువతకి పాఠం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం.. వాటిని నిలబెట్టుకోవడం.. ఇదే కాదు కెరీర్.. వాటితో మన వ్యక్తిగత జీవితాన్ని సమన్వయ పరుచుకోవడమూ ముఖ్యమే. చిన్న వయసులోనే అందాలతారగా అందలం ఎక్కినా ఆర్తీ అగర్వాల్ అదే చిన్నవయసులోనే అందర్నీ వదిలి పోయింది. జీవితంలో ఫెయిల్ అయ్యానని మరణాన్ని ఆహ్వానించినా రాని మృత్యువు.. జీవితాన్ని అర్థం చేసుకుని.. పాజిటివ్ ధృక్పథంతో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్తిని తీసుకువెళ్లిపోవడమే పెద్ద విషాదం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories