ఆడవాళ్లు మగవాళ్లగా మారిపోతారు...మగవాళ్లు ఆడవాళ్లలా...

ఆడవాళ్లు మగవాళ్లగా మారిపోతారు...మగవాళ్లు ఆడవాళ్లలా...
x
Highlights

ఆడవాళ్లు మగవాళ్లలా మారిపోతారు మగవాళ్లు ఆడవాళ్లలా రెడీ అవుతారు చిన్న పిల్లలకు మీసాలు పుడతాయి వీదుల్లో చిత్ర విచిత్ర వేషాలు దర్శనమిస్తాయి. చీపుళ్లతో...

ఆడవాళ్లు మగవాళ్లలా మారిపోతారు మగవాళ్లు ఆడవాళ్లలా రెడీ అవుతారు చిన్న పిల్లలకు మీసాలు పుడతాయి వీదుల్లో చిత్ర విచిత్ర వేషాలు దర్శనమిస్తాయి. చీపుళ్లతో దాడి చేసినా ఎవరూ పట్టించుకుకోరు. జాతర సమయంలో ఊరు వదిలి బయటకు పోరు తిరుపతిలో వందల ఏళ్లగా చేస్తున్న గంగమ్మ జాతరపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టొరీ.

ఆధ్యాత్మిక నగరి అయిన తిరుపతిలో గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాతయ్యగుంట గంగమ్మదేవత జన్మదినమైన చిత్రినెల చివరివారంలో గంగమ్మ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. వారం రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీనివాసుని సోదరిగా పేరుగాంచిన గంగమ్మతల్లికి ప్రతి గడపా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఒడిబాలు కట్టడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆఖరిరోజున విశ్వరూప దర్శనం-చెంప నరకడంతో పరిసమాప్తం కానున్నాయి.

గంగమ్మ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది గ్రామాలను తమ కనుసన్నల్లో పాలిస్తూ అక్కడి మహిళలను చెరబట్టి పైశాచిక ఆనందాన్ని తీర్చుకునే పాలేగాళ్లను. గంగమ్మ హత మార్చి ప్రజలను కాపాడటంతో ఆమెను ప్రజలు పూజించడం, ఉత్సవాలు నిర్వహించడం ఆచారంగా మారింది వందల సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పండుగకు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా సమీప తమిళనాడులోని కొన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.

గంగమ్మజాతరలో భాగంగా వారం రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో ఆరువేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత, ఆధ్యాత్మిక అంతరార్థం దాగివుంది. పాలేగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేసే వేషాలను భక్తులు అనుసరించడం భక్తుల వేషాలతో అమ్మవారు సంతృప్తి చెంది వారి కోరికలు తీర్చుతుందన్నది భక్తజన విశ్వాసం.

ఊరూరా జాతరలు మామూలే కానీ గంగమ్మ జాతరకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది వారం పాటు జరిగే ఈ జాతరలో భక్తులు చిత్ర,విచిత్ర వేషాలతో మొక్కులు తీర్చుకుంటారు. వందల ఏళ్లుగా సాగుతూ వస్తున్న ఈ జాతరకు రాయలసీమ జిల్లాలలోనే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూడా ఆదరణ వుంది.

గంగమ్మ జాతర ప్రారంభమైన రెండో రోజు నుంచి యువత, ప్రధానంగా చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. వేషాల్లో తొలిగా ప్రారంభమయ్యేది బైరాగివేషమే. శరీరమంతా నాముకొమ్ము రాచుకుని, వేపమండలు పట్టుకొని, గ్రామీణ పరుష పదజాలంతో ఒకరినొకరు వ్యంగ్య భాషతో మాట్లాడుతూ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక మూడోరోజు బండ వేషం ధరించి గంగమ్మను కొలుస్తారు.

జాతరలో నాలుగోరోజు తోటివేషంతో తిరుపతి నగరం కళకళలాడుతుంది. ఈ వేషంతో శరీరమంతా నల్లని బొగ్గుపొడి పూసుకుని, తెల్లని నామం దిద్ది, కనుబొమ్మలపైన చుక్కలు పెట్టుకోవడం సంప్రదాయం. చిన్నపిల్లలు మీసాలను ధరిస్తారు. తలకు వేపాకు మండలను చుట్టుకుని, పాతపొరక చేతబట్టి వీధుల్లో సంచరిస్తూ నగరంలోని న్యాయస్థానం వద్ద ఉన్న వేషాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అటుతర్వాత తాతయ్యగుంట గంగమ్మను దర్శించి తరిస్తారు.

ఐదోరోజు నగరంలోని కైకాల కులస్థులు వంశపారంపర్యంగా దొరవేషాన్ని ధరిస్తారు. ఆరవ రోజున ధరించే మాతంగి వేషాలు అత్యంత ప్రధానమైంది ప్రాధానమైనది ఆ రోజు స్త్రీ, పురుషులు స్త్రీరూపాన్ని ధరించి వివిధ ఆభరణములు శరీరానికి అలంకరించుకుని అమ్మవారిని దర్శిస్తారు. ఇక కైకాల కులస్థులు సున్నపు కుండల వేషాన్ని ధరించి గంగమ్మకు ప్రతిరూపంగా నగరంలోని ప్రతివీధిలో సంచరిస్తూ భక్తుల నుంచి హారతులందుకుంటారు.

ఇక చివరి రోజు గంగమ్మ విశ్వరూప దర్శనం జరుగుతుంది. అనంతరం పేరంటాళ్ల వేషం ధరించిన వంశస్థుడు అమ్మవారి చెంపనరకడంతో జాతర పూర్తౌతుంది. అమ్మవారి విశ్వరూప నిర్మాణానికి ఉపయోగించిన బంకమట్టి ని స్వీకరించడానికి భక్తులు పోటీపడతారు. ఈ బంకమట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలికమైన వ్యాధులు, గృహబాధలు, దేహబాధలు, భయం నశిస్తాయని భక్తుల విశ్వాసం.

గంగమ్మ అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరిలోనూ అచంచలమైన విశ్వాసం ఉంటుంది తమ జీవితాల్లో గంగమ్మ ప్రభావం ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక జాతర వారం రోజులూ రాయలసీమ వాసులే కాకుండా తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.


Show Full Article
Print Article
Next Story
More Stories