ఐదు దశాబ్దాల చరిత్రలో ఇస్రో వందకు పైగా మైలురాళ్లు

ఐదు దశాబ్దాల చరిత్రలో ఇస్రో వందకు పైగా మైలురాళ్లు
x
Highlights

చంద్రయాన్‌తో చంద్రమండలంపై మువ్వన్నెలు ఎగరేసి చరిత్ర సృష్టించాం. మంగళయాన్‌తో అగ్రరాజ్యాలనే ఆశ్చర్యపరిచాం. అతి తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలనే...

చంద్రయాన్‌తో చంద్రమండలంపై మువ్వన్నెలు ఎగరేసి చరిత్ర సృష్టించాం. మంగళయాన్‌తో అగ్రరాజ్యాలనే ఆశ్చర్యపరిచాం. అతి తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలనే నింగిలోకి పంపి అదరహో అనిపించాం. రోదసీ శోధనలో మనల్ని ఏకాకిని చేసిన దేశాలు కంగుతినేలా స్వదేశీ పరిజ్ణానంతో చెలరేగిపోతున్నాం. ఆర్యభట్ట నుంచి జీశ్యాట్‌ వరకూ, ఇస్రో ప్రస్థానం ఒక్కసారి చూద్దామా?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయాణం తడబడుతూనే మొదలైంది. ముళ్ల బాటలోనే సాగింది. ఏమాత్రం సౌకర్యాల్లేని రోజుల్లో, 1960లలో భారత్‌ ఖగోళం వైపు కన్నెత్తి చూడటంపై, ప్రపంచ దేశాలన్నీ ఆశ్యర్యపోయాయి. ఏమాత్రం వసతులు, పనిముట్లు లేకపోయినా...చందమామ కలల కనడంపై నవ్వుకున్నాయి. కానీ అంతరిక్షంపై మన బుడిబుడి అడుగులను ఆపలేకపోయాయి. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,అణుశాస్త్రవేత్త హోమీ బాబా, భారత అంతరిక్ష మార్గదర్శకుడు విక్రంసారాభాయ్ త్రయం కలల పునాదులపై ప్రారంభమైన ఆ అడుగులు ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు పడుతున్నాయి. అగ్రదేశాలకు దిమ్మతిరిగే ఫలితాలను రాబడుతున్నాయి.

ఉపగ్రహాల తయారీ, పరిశోధనలకు తగిన నిధులు, సరైన వనరులు లేని తొలి రోజుల్లోనే ఆర్యభట్ట ఉపగ్రహానికి ఊపిరిపోసి తన సాంకేతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది భారత్. 1975, ఏప్రిల్‌ 19న సోవియట్‌ రష్యా 'ఇంటర్‌ కాస్మోస్‌ రాకెట్‌ ద్వారా రోదసిలో కక్ష్యా ప్రవేశం చేసిన ఆర్యభట్టతో ఇండియా స్వప్నం సాకారమైంది. ఇలా మొదలైన భారత జైత్ర యాత్ర 1979, జూన్‌7న భాస్కర 1, 1981, నవంబరు 20న భాస్కర 2 ఉపగ్రహ ప్రయోగాలతో ముందుకు కదిలింది. ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. అతి తక్కువ ఖర్చుతో మంగళయాన్ చేపట్టి అమెరికా కనిపెట్టని అంశాలు ప్రపంచానికి చాటిచెప్పగలిగింది. ఐదు దశాబ్దాల చరిత్రలో ఇస్రో దాదాపు 83 దేశీ ఉపగ్రమాలు, 50 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది.

కానీ భారత అంతరిక్ష యానం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.1991లో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత భారత్ కు అద్భుతమైన అవకాశమొచ్చింది. కానీ జారవిడుచుకుని మూల్యం చెల్లించుకుంది. దీనికంతటికీ మన పాలక మహాశయులే కారణం. సోవియట్ నుంచి కీలక శాస్త్రవేత్తలు బయటకు వచ్చేశారు. వీరిని అమెరికా, ఐరోపా దేశాలు ఆకర్షించి, భారీగా లబ్ధి పొందాయి. సోవియట్‌ పతనం తర్వాత రష్యా దివాళా తీసింది. నిధుల్లేక అల్లాడిపోయింది. దీంతో అంతరిక్ష పరిశ్రమకు ప్రాణవాయువుల్లాంటి పరిజ్ఞానాలను అమ్మకానికి పెట్టింది. అంతరిక్షంలోకి తొలిసారిగా మానవుడిని పంపిన, రోదసిలో రష్యాను అగ్రస్థాయికి చేర్చిన పరిజ్ఞానాలను పెద్దమొత్తాలకు బిడ్‌ చేసిన వారికి ఇచ్చేయడానికి సిద్దపడింది. ఉష్ణ రక్షణ కవచాలు, రీఎంట్రీ క్యాప్స్యూళ్లు, స్పేస్‌సూట్‌లు, డాకింగ్‌ వ్యవస్థలు, చిన్నచిన్న అణు రియాక్టర్లు వంటివాటికి సంబంధించిన పరిజ్ఞానాలు అమ్మకానికి పెట్టింది. నాసా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 150 భారీ రాకెట్లను కొనుగోలు చేసింది. చైనా కూడా పట్టుదలగా కొన్ని పరిజ్ఞానాలను కొనింది. అందువల్లే 12 ఏళ్ల తర్వాత రోదసిలోకి మానవుడిని పంపగలిగింది చైనా.

భారత్‌, చైనాలు ఒకేసారి అంతరిక్ష పరిశోధనల రంగంలోకి అడుగుపెట్టినా....డ్రాగన్ దే పైచేయి. తొలినాళ్లలో భారత్‌ దృఢ సంకల్పంతో ముందుకు సాగి.. ఎన్నో విజయాలను అందుకుంది. అయితే వాటిని మరింత విస్తృతపరచుకోవడంలో విఫలమైంది. దీంతో చైనా కన్నా వెనుకబడిపోయింది. చైనా తన తొలి వ్యోమగామిని 2003లోనే పంపింది. తన తొలి మహిళా వ్యోమగామిని కక్ష్యలోకి చేర్చింది. విజువల్స్

ప్రత్యర్థి దేశాల మధ్య పోటీ, మట్టికరిపించాలన్న తపన తొలినాళ్లలో అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు ఇవే ఇంధనం, అదే లక్ష్యం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ మధ్య నెలకొన్న పోటీ.. అంతరిక్ష రంగాన్ని పరుగులు పెట్టించాయి. రెండు దేశాలూ నువ్వా నేనా అన్న స్థాయిలో ప్రయోగాలు జరిపాయి. కానీ సోవియట్‌ పతనంతో ఒక్కసారిగా అంతరిక్ష పరిశోధన మలుపు తిరిగింది. రోదసీలో అమెరికా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు అంతరిక్ష పోటీ భారత్‌-చైనాల మధ్య సాగుతోంది. భవిష్యత్‌లో పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే సరిపడినన్ని నిధుల్లేకపోవడం, రాజకీయ దృఢసంకల్పం కొరవడటం ఇస్రో ముందరికాళ్లకు బంధం వేసింది. చైనా అంతరిక్ష బడ్జెట్‌ ఇంచుమించు 220 కోట్ల డాలర్లు ఉండగా భారత్ కేటాయింపులు అందులో మూడోవంతు మాత్రమే. దశాబ్దాల పాటు అమెరికా ఆంక్షల చక్రం కింద ఇస్రో నలిగిపోవడం కూడా పరిస్థితిని సంక్లిష్టం చేసింది.

అయితే పడిలేచిన కెరటంలా ఇస్రో దూసుకెళుతోంది. అనితర సాధ్యమైన ఎన్నో విజయాలను నమోదు చేసింది. చౌకగా, విజయవంతంగా స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో తనకు తిరుగలేదని నిరూపించింది. అంతరిక్ష వాణిజ్యంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories