ఎన్నికల ముందు గులాబీ దళంలో గ్రూపుల గుబులు

x
Highlights

పాత కొత్త నేతల మధ్య దూరం టిఆర్ఎస్ లో దుమారం రేపుతోంది. దీనికితోడు పార్టీలో విచ్చలవిడిగా గ్రూపులు పెరిగి పోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర...

పాత కొత్త నేతల మధ్య దూరం టిఆర్ఎస్ లో దుమారం రేపుతోంది. దీనికితోడు పార్టీలో విచ్చలవిడిగా గ్రూపులు పెరిగి పోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గ్రూప్ రాజకీయాలు తలనొప్పిగా మారాయి. నోరు జారుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయటంతో పాటు నియోజకవర్గ స్థాయి గొడవలను పరిష్కరించే బాధ్యత మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

అధికారపార్టీ టీఆర్ఎస్ లో గ్రూప్ తగాదాలు భగ్గుమంటున్నాయి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో వాటిని పరిష్కరించే దిశగా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. నియోజకవర్గ స్థాయిలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం, నేతల మధ్య విభేదాలు పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు నేతలు నోటికి పని చెప్తున్నారు. సొంత పార్టీ నేతల పైన విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ పార్టీ అంతర్గత రాజకీయాలలో రచ్చ రాజేస్తున్నారు.

పార్టీలో పాత కొత్త నేతల మధ్య ఎప్పట్నుంచో విభేదాలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ శ్రేణుల్లో కలవటంలేదు. రెండు వర్గాలు విడివిడిగానే ఎవరికి వాళ్ళు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సమావేశ వేదికల పైనే ఒకరిపై ఒకరు జగడానికి దిగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గొడవలు తారస్థాయికి చేరుతున్నాయి. ఈమధ్యనే వరంగల్ జిల్లా పరకాల మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం విషయంలో ఓటమికి గ్రూప్ తగాదాలే కారణమని పార్టీ హైకమాండ్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. టిడిపిలో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన చల్లా ధర్మారెడ్డి వర్గానికి టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సహకరించకపోవడం నియోజక వర్గంలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పరకాల మున్సిపాలిటీ చేజారిపోయినట్లు టిఆర్ఎస్ హై కమాండ్ దృష్టికి వచ్చింది.

ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్థులపై ఈమధ్య నోరు పారేసుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు హైకమాండ్ నుంచి తమకు హామీ ఉందని టికెట్ ఆశిస్తున్న నేతలు ప్రచారం చేసుకోవటం క్షేత్రస్థాయిలో ఇబ్బందికరంగా మారింది. దీంతో పార్టీ వర్గాలుగా చీలి పోతోంది. దీంతో ఈ వర్గాలను కట్టడి చేయడానికి పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగింది.

క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఉన్న విభేదాలు కంట్రోల్ చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ మంత్రులకు అప్పగించినట్టు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడోద్దని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. నేతల మధ్య విభేదాలు పరిష్కరించే విషయంలో మంత్రులే సుప్రీంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. పాత కొత్త నేతల మధ్య సమన్వయం కోసం మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి నేతలందరినీ కలపాలని వారి మధ్య విభేదాలు తొలగించాలని మంత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. సమస్యలు మరీ తీవ్రంగా ఉంటే పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రానున్న రెండు నెలల్లో వివాదాలకు చెక్ పెట్టాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మంత్రులకే విభేదాలు ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇతర నేతలను సమన్వయం చేసే ముందు తమ విభేదాలను పక్కనపెట్టి ముందుకు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories