పదవుల పండగ...17 సంస్థలకు చైర్మన్ల నియామకం

Submitted by arun on Wed, 04/11/2018 - 11:17
babu

నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ సహా 17 కార్పొరేషన్ల చైర్మన్లను భర్తీ చేస్తూ జాబితా విడుదల చేశారు. పదవుల పందేరంలో అన్ని ప్రాంతాలు, వర్గాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నారు. ముందు నుంచి అనుకుంటున్నట్టే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీటీడీ చైర్మన్ పదవి దక్కింది. 

రాష్ట్రంలో పలు నామినెటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు. టీటీడీ సహా పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియమించారు. చాలా వరకు ముందు అనుకున్న వారికే పదవులు దక్కాయి. కొందరికి ఆఖరి క్షణంలో అదృష్టం వరించింది. 

టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను నియమిస్తారని వచ్చిన వార్తలే చివరికి నిజమయ్యాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైన కడప జిల్లాకు చెందిన సుధాకర్ యాదవ్ వైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపారు. ఆయన గతంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు.

రాష్ట్రంలోని 17 వివిధ కార్పొరేషన్లకు కూడా ఏపీ ప్రభుత్వం ఛైర్మన్లను నామినేట్ చేసింది. ఇటీవలే టీడీపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి కూడా పదవి లభించింది. ఏపీ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కిషోర్ కుమార్ రెడ్డిని నామినేట్ చేశారు.

ఆర్టీసీ చైర్మన్‌ పదవికి వర్ల రామయ్యను ఎంపిక చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలో మరో దళిత నేత జూపూడి ప్రభాకరరావును కొనసాగించారు. కాపు సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుణ్ని బాబు సర్కారు నామినేట్ చేసింది. 

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా అంకమ్మ చౌదరిని నియమించారు. ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా దాసరి రాజా, మైనార్టీస్ కమిషన్ చైర్మన్‌గా ఎస్.ఎం.జియాఉద్దీన్‌లకు పదవులు దక్కాయి. మైనారిటీ ఆర్థిక సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హిదాయత్‌కు మరోసారి అవకాశం లభించింది.

కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవి దక్కింది. గొర్రెల పెంపకాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వై. నాగేశ్వరరావు యాదవ్, కనీస వేతన బోర్డు ఛైర్మన్‌గా రఘుపతుల రామ్మోహన్‌రావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నామన రాంబాబు నామినేట్ అయ్యారు.

ఆర్టీసీ కడప రీజియన్‌ ఛైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ ఛైర్మన్‌గా పార్థసారధి, ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ ఛైర్మన్‌గా ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ ఛైర్మన్‌గా తెంటు లక్ష్మీనాయుడు నియమితులయ్యారు.

టీటీడీ పాలక మండలి సభ్యుల పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈ కార్పొరేషన్లకు పాలక మండలి సభ్యుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో మరికొన్ని పదవుల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిసింది. బీసీ కార్పొరేషన్‌, మహిళా ఆర్థిక సంస్థ వంటివి ప్రకటించాల్సి ఉంది.

English Title
Govt Appointed 17 Corporation Chairman's

MORE FROM AUTHOR

RELATED ARTICLES