సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న పథకం లోపాలు

సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న పథకం లోపాలు
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం నీరుగారుతోంది. పథకం అమలులో లోపాలు సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి....

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం నీరుగారుతోంది. పథకం అమలులో లోపాలు సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులు ఎంతకాలం తరువాత అమ్ముకోవచ్చన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో దానిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అధికారుల నుంచి గొర్రెలను అందుకున్న కొద్ది రోజులకే విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలకు అధికారులు కూడా తమవంతు సాయం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు తగినన్ని గొర్రెల దొరక్కపోవడంతో అధికారులు కూడా కొనుగోళ్లు చేస్తూ..తిరిగి వాటినే పంపిణీ చేస్తున్నారు. ఇలా గొర్రెల రీసైక్లింగ్‌కు అధికారులు కూడా తమవంతు సాయం చేస్తున్నారు.

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సబ్సిడీ గొర్రెలను ఇటీవల వరుసగా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. పైగా పట్టుకున్న గొర్రెలను ఎక్కడ ఉంచాలి..? ఏం చేయాలన్న సమస్య ఎదురవుతోంది. రీ సైక్లింగ్‌ ద్వారా దొరికిన గొర్రెల నిర్వహణ .. అధికారులకు కష్టతరంగా మారింది. అంతేకాదు..గొర్రెలను అమ్ముతున్న లబ్దిదారులపైనా..వాటిని కొన్నవారిపైనా...కేసులు పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేసులు పెట్టినా.. లబ్ధిదారులు గొర్రెలను కచ్చితంగా ఇంతకాలం తరువాతే విక్రయించాలన్న నిబంధన లేకపోవడంతో ఆ కేసులు నిలబడడం లేదు.

గొర్రెల పథకం ద్వారా లబ్దిదారులకు భవిష్యత్తులో ఊహించని లాభాలు తేవాలనేది ప్రభుత్వ యోచన. నిజానికి మూడేళ్ల పాటు గొర్రెలను పెంచి పోషిస్తే పెద్ద మందే తయారవుతుంది. లబ్దిదారులకు అందించే ఒక యూనిట్‌లో 20 గొర్రెలు..ఒక పొట్టేలు ఉంటాయి. ప్రతి గొర్రె 8 నెలలకు ఒకసారి పిల్లలను పెడుతుంది. అంటే రెండేళ్లలో మూడు ఈతలకు మూడు పిల్లలు వస్తాయి. లబ్ధిదారులు రెండేళ్లపాటు గొర్రెలను అమ్మకుండా పోషించుకుంటే మొదటి ఉత్పత్తిగా 60 గొర్రెలు వస్తాయి. మూడేళ్ల పాటు అలా పోషిస్తే కనీసం వంద జీవాల మంద తయారవుతుంది. మూడేళ్ల తర్వాత ప్రతి మంద మీద 8 నెలలకు కనీసం 30 గొర్రెలు అమ్ముకోవచ్చు. ఇలా లబ్దిదారులకు ప్రతి 8 నెలలకు లక్షకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

యాదవులు, కురుమలను ఆర్థికంగా బలోపేతం చెయ్యాలన్న లక్ష్యంతో ప్రారంభమైన గొర్రెల పంపిణీ నిబంధనల్లో లోపాల కారణంగా నీరుగారుతోంది. గొర్రెల అమ్మకాలను నియంత్రించేందుకు పశుసంవర్థకశాఖ జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసింది. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు రెండేళ్లపాటు గొర్రెలను అమ్మకుండా నియమ, నిబంధనలు రూపొందించాలని అధికారులు సూచిస్తున్నారు. లబ్ధిదారులు గొర్రెలను ఎంతకాలం తరువాత విక్రయించాలో స్పష్టమైన ఉత్తర్వులిస్తేనే రీసైక్లింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు గొర్రెల లబ్ధిదారులు మేత లభించని పరిస్థితుల్లోనే గొర్రెలను అమ్మేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో సబ్సిడీ గొర్రెలకు సరైన మేత అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు ఇతర రాష్ట్రాల్లో గొర్రెల లభ్యత తగ్గిపోవడంతో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం మేరకు సబ్సిడీ గొర్రెల పంపిణీ జరగడంలేదు. దాదాపు 7 లక్షల 20 వేల మందికి ఏడాదికి ఒక విడత చొప్పున.. రెండు విడతల్లో గొర్రెల పంపిణీని పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా మార్చి 31కి 3 లక్షల 62 వేల మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా...ఇప్పటికి లక్షా..63 వేల మందికి మాత్రమే పంపిణీ చేశారు. ప్రస్తుత లెక్కలనుబట్టి చూస్తే ...లబ్ధిదారులందరికీ గొర్రెల పంపిణీ జరగడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories