డిజిటల్ లావాదేవీల రంగంలోకి గూగుల్

Submitted by lakshman on Thu, 09/14/2017 - 17:03

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు వెబ్ సంబంధిత సేవలనందిస్తోన్న గూగుల్ డిజిటల్ లావాదేవీల రంగంలో కూడా జెండా పాతడానికి అడుగులు వేస్తోంది. టెజ్ అనే పేరుతో భారత్‌లో ఈ- పేమెంట్స్ సేవలను అందించడానికి గూగుల్ రంగం సిద్ధం చేసుకుంది. సెప్టెంబర్ 18న గూగుల్ డిజిటల్ పేమెంట్స్ సేవలను ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల వినియోగం బాగా పెరిగింది. దీంతో పేటీఎం వంటి ఈ పేమెంట్ సంస్థలు అనూహ్యంగా రాణించాయి. పేటీఎం లాభాల బాటలో పయనించింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే గూగుల్.. డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అమల్లోకి తెచ్చిన యూపీఐ పేమెంట్స్ ఆధారిత సేవలను టెజ్ పేరుతో గూగుల్ అందించనుంది.

గూగుల్ మాత్రమే కాదు ఇతర అంతర్జాతీయ కంపెనీలు కూడా భారత్‌లో డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన సేవలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాయి. వాట్సాప్ ఇప్పటికే యూపీఐ ఆధారిత యాప్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు టెక్నాలజీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు వాట్సాప్ యాజమాన్యం ఎన్‌పీసీఐతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇండియాలో డిజిటల్ లావాదేవీలను వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగనుందని సదరు కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఇలా ఒక్కొక్క కంపెనీ డిజిటల్ సేవల రంగం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

English Title
google to launch UPI-based digital payment service Tez in india

MORE FROM AUTHOR

RELATED ARTICLES