500 సంవత్సరాలు పూర్తిచేసుకున్న గోల్కొండ కోట

x
Highlights

గోల్కొండ.. ఈ పేరు చెబితే హైదరాబాద్ చరిత్ర గుర్తొస్తుంది. నవాబుల పాలన కళ్లముందు కనిపిస్తుంది. కోటలోకి అడుగు పెట్టగానే చేతులు చప్పట్లు కొట్టేస్తాయ్....

గోల్కొండ.. ఈ పేరు చెబితే హైదరాబాద్ చరిత్ర గుర్తొస్తుంది. నవాబుల పాలన కళ్లముందు కనిపిస్తుంది. కోటలోకి అడుగు పెట్టగానే చేతులు చప్పట్లు కొట్టేస్తాయ్. కాళ్లు రామదాసు కారాగారం వైపు తీసుకెళ్తాయి. కళ్లు కోట పైనుంచి హైదరాబాద్ అందాలు చూసేందుకు ఉత్సాహం చూపుతాయి. 5 వందల ఏళ్లైనా చరిత్రకు సాక్ష్యంగా మన కళ్ల ముందే ఉన్న గోల్కొండపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

రాజధాని హైదరాబాద్‌కు తలమానికం నవాబుల చరిత్రకు సజీవ సాక్ష్యం. అదే ఈ గోల్కొండ చరిత్ర. గోల్కొండ నిర్మాణం జరిగి ఈ ఏడాదితో 5 వందల ఏళ్లు పూర్తయ్యాయ్. ఒకప్పుడు భాగ్యనగర శివార్లలో ఉండి ఇప్పుడు నగరంలో భాగమైపోయింది గోల్కొండ. 1083వ సంవత్సరం నుంచి 1323 వరకు ఈ ప్రాంతమంతా కాకతీయుల పాలనలో ఉండేది. అప్పుడు ఈ గోల్కొండను గొల్లకొండగా పిలిచేవారు. ఈ క్రమంలో ఈ కొండపై ఓ గొర్రెల కాపరికి అమ్మవారి విగ్రహం కనిపించింది. ఈ విషయం కాకతీయరాజులకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారు. ఇప్పుడు ఆ దేవతకే మనం తొలిబోనం సమర్పించేంది. కాలక్రమంలో గొల్లకొండ కాస్తా గోల్కొండగా మారింది.

కాకతీయుల కాలంలో జరిగిన ఓ యుద్ధ సంధిలో భాగంగా 1371లో గోల్కొండ కోట అజీం హుమాయున్ సొంతమైంది. దీంతో ఈ కోట ముస్లిం రాజుల ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత అనేక మంది రాజుల నుంచి మారి 15వ శతాబ్దంలో కుతుబ్‌షాహీల ఆధీనంలోకి వచ్చింది. అప్పుడే వీళ్లు గోల్కొండను రూపురేఖలు మార్చేశారు. నల్లరాతితో అద్భుతమైన, శత్రుదుర్భేధ్యమైన కోటగా మార్చేశారు. ఇలా 5 వందల ఏళ్లలో ఎన్నో విపత్తులు, ఉపద్రవాలతో కోటలో కొంత భాగం పాడైపోయింది. అయినప్పటికీ నవాబుల పాలనకు, వారి చరిత్రకు గోల్కొండ సాక్ష్యంగా నిలుస్తోంది.

గోల్కొండ కోటను అప్పట్లో 120 మీటర్ల ఎత్తులో నల్లరాతికొండపై నిర్మించారు. కోట లోపలో ఎన్నో విశేషమైన కట్టడాలుంటాయి. కోట నిర్మించేటప్పుడే శత్రువుల నుంచి రక్షించుకునేందుకు దీని చుట్టూ పెద్ద పెద్ద బురుజులను ఏర్పాటు చేశారు. కోటు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో 87 అర్ధచంద్రాకార బురుజులు నిర్మించారు. గోల్కొండ ఖిల్లాలో 4 ప్రధాన సింహద్వారాలు, అనేక రాజమందిరాలు ఆలయాలు, మసీదులు ఉన్నాయి. కోటలోనికి శత్రువులు వస్తే పైన ఉన్న వారికి సమాచారం తొందరగా చేరవేసేందుకు ధ్వనిశాస్త్రం ఆధారంగా ఓ అద్భుతమైన కట్టడం నిర్మించారు. ఇక్కడ నిలబడి చప్పట్లు కొడితే కోట లోపల కిలోమీటరు దూరంలో ఉన్న బాలా మిస్సారు దగ్గరి వరకు శబ్దం చక్కగా వినబడుతుంది.

కోటలో కాకతీయ రాజులచే నిర్మించిన కొన్ని ప్రాచీన దేవాలయాలున్నాయి. హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వీటిని ఆ కాలంలో ఉండే గండశీల రాతితో నిర్మించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు శ్రీరామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్నను తానీషా ప్రభువు ఈ కోటలోని కారాగారంలోనే బంధించాడు. ఆ సమయంలో రామదాసు గోడలపై చెక్కిన సీతారామలక్ష్మణ విగ్రహాలుంటాయి. ఇప్పటికీ ఆ దేవతామూర్తులకు పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గోల్కొండను చూసేందుకు వచ్చిన పర్యాటకులు సైతం రామదాసు చెరసాలను చూడకుండా వెళ్లలేరు.

గోల్కొండ నిర్మాణమే ఓ అద్భుతం. ఇందులో ప్రతి కట్టడంలో ఇటలీ, పర్షియన్ నైపుణ్యం కనిపిస్తుంది. అప్పటి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, నిర్మాణ విలువలు చూస్తే మతిపోతుంది. ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజీయా అని ముక్కున వేలేసుకుంటారు. అందుకే గోల్కొండ అప్పటికి ఇప్పటికి అంత స్పెషల్.

గోల్కొండ కోట గురించి ఎంత చెప్పినా తక్కువే. కోటలోకి ఎంటరయ్యే దగ్గర్నుంచి చివరి అంచు దాకా ప్రతీదీ ప్రత్యేకమే. కోటలోపల నిర్మించిన ప్రతి నిర్మాణం అద్భుతమే. చప్పట్ల ప్రాంగణం, రామదాసు చెరసాలతో పాటు శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన దర్వాజాలు, బాలాహిస్సార్, రక్షకభట నిలయం, అక్కన్న, మాదన్న కార్యాలయం, ఆయిల్ స్టోర్ హౌస్, కుతుబ్‌షాహీల స్నానశాల, కఠోరా హౌస్‌, నగీనా బాగ్‌, బడీ బౌలి, డ్రగ్‌ ట్యాంక్‌ కాలువ, శవ స్నానశాల, దాద్‌ మహల్, తారామతి, బారామతితో పాటు ఎన్నో ఆలయాలు, మసీదుల సమ్మిళితమే గోల్కొండ ఖిల్లా. గోల్కొండలోని ప్రతి కట్టడంలో ఇటలీ, పర్షియన్ ఇంజనీరింగ్ నైపుణ్యం కనిపిస్తాయి. అందుకే ఇప్పటికీ ఈ నిర్మాణాలు మనం చూడొచ్చు. కోట లోపల అడుగడుగునా ఆశ్చర్యపరిచే నిర్మాణాలే ఉంటాయి. ఇవన్నీ చూసేందుకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.

చరిత్ర చెబుతున్న కాలమానాలను బట్టి గోల్కొండ కోట నిర్మించి 5 వందల సంవత్సరాలైంది. ఇన్నేళ్ల తర్వాత కోట విశిష్టత అందరికీ తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధానమంత్రి జెండా ఎగరేసినట్టుగానే.. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో సీఎం జెండా ఎగరేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే.. నాలుగేళ్లుగా.. గోల్కొండ ఖిల్లాలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. కానీ.. మిగతా సమయాల్లో కూడా కోటను పట్టించుకుంటే బాగుంటుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.

గోల్కొండ కోటను చూసేందుకు.. రోజూ ఎంతోమంది టూరిస్టులు దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. వారి కోసం అలనాటి కోట విశేషాలు తెలియజేసేలా.. సౌండ్ అండ్ లైట్ షో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. 500 ఏళ్లైనా కుతుబ్‌షాహీలు, నిజాం నవాబుల చరిత్రకు అద్దం పడుతోంది గోల్కొండ. కానీ ఇప్పటికే కోటలో చాలా భాగం పాడైపోయింది. చరిత్ర సాక్ష్యంగా భావితరాలకు గోల్కొండ కనిపించాలంటే ఇప్పటి నుంచే ప్రభుత్వం మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories