టీ కప్పులో తుపాను

Submitted by arun on Thu, 06/21/2018 - 17:55

మంత్రి గంటా శ్రీనివాసరావు అలక ఎపిసోడ్  టీ కప్పులో తుపానులా ముగిసింది. హోమ్ మినిస్టర్ చినరాజప్ప, వియ్యంకుడు మంత్రి నారాయణల  ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడిన తరువాత గంటా ఎట్టకేలకు మెత్తబడ్డారు.  మూడు రోజుల నుంచి విధులకు దూరంగా ఉణ్న ఆయన సీఎం పర్యటనలో పాల్గొన్నారు.  

విశాఖ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మంత్రి గంటా అలక వ్యవహారం ప్రకంపలు రేపింది. సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులకు దూరంగా ఉన్న గంటాను బుజ్జగించేందుకు అధిష్టానమే నేరుగా రంగంలోకి దిగింది. మంత్రులను రంగంలోకి దించినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగి గంటాతో చర్చించారు. భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా లేదంటూ హామి ఇచ్చి భరోసానిచ్చారు. 

వాస్తవానికి గంటాకు జిల్లాలోని సొంత పార్టీ నేతలతోనే పొసగడం లేదు. విశాఖ భూముల ఆక్రమణ వ్యవహారంతో పాటు  తీవ్ర స్ధాయిలో అవినీతి అరోపణలు వెల్లువెత్తడంతో ఒక దశలో గంటాను పక్కన పెట్టాలని  అధిష్టానం కూడా భావించినట్టు వార్తలు వినిపించాయి.  ఇదిలా ఉండగానే  తాజా  సర్వేలో గంటా వెనకబడ్డారన్న వార్తలు ముసలానికి కారణమయ్యాయి. తనపై  అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ  అలకబూనిన గంటా .. పార్టీ కార్యక్రమాలకు దూరంగా  ఉంటూ కేబినేట్ మీటింగ్ కుడా హాజరుకాలేదు. దీంతో గంటా పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఒక దశలో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. 

వ్యవహారం వెలుగుచూడగానే  అప్రమత్తమైన పార్టీ అధిష్టానం గంటాను బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టింది. హోం మంత్రి చినరాజప్పను  రాయబరానికి పంపి రాజీ చర్యలు చేపట్టింది. అయితే ఈ సందర్భంగా పార్టీలోని వ్యతిరేకవర్గంపై శివాలెత్తిన గంటా అధిష్టానానికి పలు ప్రశ్నలు సంధించారు. విశాఖ భూముల విషయంలో తన ప్రమేయం లేదంటూ సిట్ నివేదిక ఇచ్చినా ఎందుకు బహిర్గతం చేయడం లేదంటూ ప్రశ్నించారు. తన వ్యతిరేక వర్గం బహిరంగంగా ఆరోపణలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చినరాజప్పను నిలదీశారు. దీనిపై మీడియా సమావేశం నిర్వహించి నిజనిజాలు చెబుతానంటూ హెచ్చరించారు. అయితే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేయలేదన్న చినరాజప్ప  సీఎంతో స్వయంగా మాట్లాడించారు.  దీంతో మెత్తబడిన గంటా సీఎం పర్యటనలో పాల్గొన్నారు.  

గంటా అలకవీడినా తాత్కాలికమేనంటున్న ప్రత్యర్ధులు, అధికార పార్టీలోని ఓ వర్గం పలు అనుమానాలు ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో గంటా పార్టీని వీడితే ఎటు వెళ్తారనేది కూడా ఆసక్తిగా మారింది.  వైసీపీ, జనసేన పార్టీల్లో వున్న బలం, బలహీనతలను పరిశీలిస్తున్నారానే ఊహగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.  ప్రస్తుతానికి గంటా అలక వీడినా ..భవిష్యత్‌ కార్యాచరణపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.   

English Title
Ganta Srinivasa Rao Attend to Chandrababu Tour

MORE FROM AUTHOR

RELATED ARTICLES