రివ్యూ: గ్యాంగ్‌

రివ్యూ: గ్యాంగ్‌
x
Highlights

నటీనటులు : సూర్య, కీర్తి సురేశ్‌, రమ్యకృష్ణ , కార్తీక్‌ జానర్‌ : యాక్షన్‌, డ్రామా, వినోదం దర్శకుడు : విఘ్నేశ్‌ శివన్‌ సంగీతం : అనిరుధ్‌ నిర్మాత :...

నటీనటులు : సూర్య, కీర్తి సురేశ్‌, రమ్యకృష్ణ , కార్తీక్‌
జానర్‌ : యాక్షన్‌, డ్రామా, వినోదం
దర్శకుడు : విఘ్నేశ్‌ శివన్‌
సంగీతం : అనిరుధ్‌
నిర్మాత : కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా

సూర్య హీరోగా, యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంయుక్తంగా నిర్మించిన ‘గ్యాంగ్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడులైంది. మొదటిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. తమిళ హీరో అయిన సూర్యకి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. తన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్‌ అవుతుంటాయి. మరి సూర్య గత సినిమాల్లాగే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు చేరువైందో లేదో తెలుసుకుందాం..

కథేంటంటే: సీబీఐ ఆఫీస్‌లో ఓ గుమాస్తాగా పనిచేసే వ్యక్తి కొడుకు తిలక్‌ (సూర్య).. చిన్నప్పటినుంచి అతను కూడా సీబీఐ ఆఫీసర్‌ కావాలనుకుంటాడు. అయితే అక్కడ ఉత్తమ్‌దాస్‌ అనే అధికారి అవినీతికి పాల్పడతాడు. ఆ విషయాన్ని సూర్య తండ్రి పై అధికారులకు చెబుతాడు. దీంతో పగబట్టిన ఆ అధికారి సూర్య సీబీఐ ఆఫీసర్‌ కాకుండా అడ్డుపడతాడు. తర్వాత సూర్య ఏం చేశాడు? ఆ అధికారికి సూర్య విసిరిన సవాల్‌ ఏమిటి? అసలు సూర్యకి గ్యాంగ్‌ ఎక్కడిది? ఆ గ్యాంగ్‌ తో ఏం చేశాడు? అనేది థియేటర్‌లో చూడాల్సిందే..

ఎలా ఉందంటే: 1987 నేపథ్యంలో జరిగే కథ ఇది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని ఎత్తిచూపుతూ వారి బాధ్యతను గుర్తు చేస్తుంది. తొలి సగభాగం సినిమా పాత్రల నేపథ్యాన్ని పరిచయం చేస్తూ.. నకిలీ సీబీఐ గ్యాంగ్‌ అక్రమార్కుల సొమ్మును కాజేసే సంఘటనలతో సాగుతుంది. ఆ సన్నివేశాల్లోనే వినోదాన్ని మేళవించడంతో సరదా సరదాగా సాగుతుంది. గ్యాంగ్‌ ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెబుతూ ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. అవి హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. విరామం సమయానికి సీబీఐ అధికారులకు గ్యాంగ్‌ ఆచూకీ తెలుస్తుంది. ద్వితీయార్ధం మొత్తం ఆ గ్యాంగ్‌ను వెంటాడే ప్రయత్నం... గ్యాంగ్‌ కూడా సీబీఐ అధికారులకు దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేయడంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అంతా ఓ ఎత్తైతే.. పతాక సన్నివేశాలు మరో ఎత్తు. అక్కడ మలుపులు, సందేశం హత్తుకునేలా ఉంటాయి.

ఎవరెలా చేశారంటే: సూర్య అభినయం చిత్రానికి ప్రధాన బలం. ఓ మధ్యతరగతి యువకుడిగా, గ్యాంగ్‌కు లీడర్‌గా చక్కటి నటన కనబరిచాడు. సీబీఐ ఆఫీసర్‌ ఝాన్సీరాణిగా మారిన బుజ్జమ్మ పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకుంటుంది. సీబీఐ బాస్‌ శివశంకర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు కార్తిక్‌ కనిపించడం బాగుంది. కీర్తిసురేశ్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితం అయ్యింది. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు సందడి చేస్తాయి. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. 1987 నేపథ్యానికి తగ్గట్టుగా సంగీతం అందించడంలో అనిరుధ్‌ చక్కటి పనితీరును కనబరిచారు. దినేశ్‌‌ కృష్ణన్‌ ఛాయాగ్రహణం బాగుంది. విఘ్నేష్‌ శివన్‌ ‘స్పెషల్‌ 26‌’ స్ఫూర్తితో కథ రాసుకున్నా.. దక్షిణాదికి తగ్గట్టు మార్పులు చేసుకున్నారు. సన్నివేశాల్లోనే వినోదం మేళవించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.

బలాలు

+ నటీనటుల ప్రతిభ

+ ద్వితీయార్ధం

+ సందేశం

బలహీనతలు

- సాదాసీదా ప్రథమార్ధం

చివరిగా: మంచి ‘గ్యాంగ్‌’

Show Full Article
Print Article
Next Story
More Stories