గులాబీ కంచుకోటపై గద్దర్ గురి!

గులాబీ కంచుకోటపై గద్దర్ గురి!
x
Highlights

ఒకప్పుడు ఆయన ఓటును బహిష్కరించాడు. ఆయుధంతోనే అణగారిన వర్గాలకు విముక్తి అని నమ్మాడు. కాలికి గజ్జకట్టాడు. విప్లవ గీతమై జనాన్ని చైతన్యం చేశాడు. ఆటతో,...

ఒకప్పుడు ఆయన ఓటును బహిష్కరించాడు. ఆయుధంతోనే అణగారిన వర్గాలకు విముక్తి అని నమ్మాడు. కాలికి గజ్జకట్టాడు. విప్లవ గీతమై జనాన్ని చైతన్యం చేశాడు. ఆటతో, పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు. ఒకనాడు ఓటు వద్దన్నా ఆయనే, ఇప్పుడే అదే ఓటు వజ్రాయుధమని చెబుతున్నాడు. ప్రజాస్వామ్య రణక్షేత్రమైన ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే పోటీకి సై అంటున్నాడు. గులాబీదళాధిపతి వర్సెస్‌ ప్రజాయు‌ద్ధ నౌక పోరుతో, గజ్వేల్‌ నియోజవర్గంపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది.

ప్రజాగాయకుడు గద్దర్‌ రాజకీయ రంగం ప్రవేశంపై గతంలోనూ వార్తలు వినిపించాయి. ఆయన ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. గద్దర్‌ కూడా తన అనుచరులు, సానుభూతి పరులతో సమావేశమయ్యారు. వామపక్షాల ప్రతిపాదనపై చర్చించారు. కానీ ఎందుకనో వెనక్కితగ్గారు. ఆ తర్వాత కూడా, వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు, రాజకీయ విమర్శలు చేశారు కానీ, పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ, తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు గద్దర్. ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఓటు ప్రజల తలరాతలను మార్చే శక్తి అంటూ, ఎమ్మెల్యేగా రంగంలోకి దిగాలని డిసైడయ్యారు. గద్దర్‌ పోటీ చేయాలనుకుంటున్న స్థానం, ఏదో సామాన్యమైన నియోజకవర్గం కాదు. గులాబీ కంచుకోట, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్.

ఏకంగా గజ్వేల్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్దమని ప్రకటించి సంచలనం సృష్టించారు గద్దర్. తాను పుట్టిన ఊరు గజ్వేల్‌ అని, ఈ స్థానం నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు గద్దర్. అయితే, గద్దర్ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. అటు సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌తోనూ ఆయన కొంతకాలం సభలు, సమావేశాల్లో తిరిగినా, పోటీ విషయానికి వచ్చేసరికి ఆయన ఎందుకనో, బీఎల్‌ఎఫ్‌ నుంచి బరిలోకి దిగడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. మహాకూటమి సహా, అన్ని పక్షాలు తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు గద్దర్.

మరి గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానంటున్న గద్దర్‌కు, మహాకూటమి మద్దతిస్తుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. అయితే, సీఎం కేసీఆర్ వంటి మహా నాయకుడిపై పోటీ చేస్తానని ప్రకటించి, అందరిలోనూ ఆసక్తి పెంచారు గద్దర్. మరి గులాబీ దళాధిపతిపై గెలుపు అంత సులువా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. అయితే, నాలుగున్నరేళ్లలో గజ్వేల్‌కు కేసీఆర్‌ చేసిందేమీ లేదని, గద్దర్ అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి, ఓట్లు అడుగుతానని చెబుతున్నారు.
మొత్తానికి ఒకవైపు గులాబీ దళాధిపతి మరోవైపు ప్రజాగాయకుడు గద్దర్. ఒకరు తెలంగాణ సాధకుడిగా, తెలంగాణ తొలి సీఎంగా, అపర చాణక్యడిగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు దశాబ్దాల తరబడి ప్రజాగాయకుడిగా, మావోయిస్టుల సానుభూతి పరుడిగా, సాంస్కృతిక విప్లవ యోధుడిగా గద్దర్‌కు సైతం పేరుంది. సీఎంపై పోటీ చేస్తానని గద్దర్‌ ప్రకటించడంతో, అందరి దృష్టి గజ్వేల్‌పై పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories