చిక్కుల్లో బాబు గోగినేని...ఆధార్ కార్డు డేటాను విదేశాలకు...

Submitted by arun on Wed, 06/27/2018 - 14:37
Babu Gogineni

ప్రముఖ హేతువాది బాబు గోగినేని చిక్కుల్లో పడ్డారు. కొన్ని మతాలను కించపరిచేలా పోస్టులు పెట్టడంతో పాటు ఆధార్‌ నంబర్ల సమాచారాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణల మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 13 సెక్షన్ల కింద కేసు పెట్టారు.  

గోప్యత పాటించాల్సిన ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని, అతని అనుచరులు వారి సంస్థల ద్వారా విదేశాలకు అందజేస్తున్నారంటూ కేవీ నారాయణ అనే వ్యక్తి హైదరాబాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్‌కు ఫౌండర్‌గా ఉన్న బాబు గోగినేని..తన కార్యక్రమాలకు వచ్చే వారి ఆధార్ సమాచారాన్ని అనుమతి లేకుండా సేకరిస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. బాబు గోగినేని కి చెందిన సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సంస్థ కార్యక్రమాలు మలేషియా కేంద్రంగా జరుగుతాయని..అలా ఇతర దేశాలకు మన పౌరుల సమాచారం చేరవేస్తున్నారని ఫిర్యాదు దారుడి ఆరోపణ. ఆధార్ డాటాను లీక్ చేయడం దేశ భద్రతకు ప్రమాదంగా మారుతోందరని ఫిర్యాదుదారు అంటున్నారు.  

అంతేకాదు..ఇతర మతాలను కించపరిచే విధంగా బాబుగోగినేని పలు వెబ్ సైట్లలో పోస్టులు పెట్టారని కూడా కేవీ నారాయణ ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బాబు గోగినేనిపై దేశద్రోహం కేసుతో పాటు కులాలు మతాలు,ప్రాంతాలు వర్గాల పేరిట ప్రజల్లో ద్వేష భావం రగల్చటం...నమ్మకద్రోహం , మోసం, దురుద్దేశ్యంతో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేయటం వంటి సెక్షన్లు వర్తించేలా మొత్తం 13 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

బాబు గోగినేనిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాబు గోగినేని బిగ్ బాస్ షోలో ఉన్నారు. దీంతో  ఆయనపై పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠగా మారింది. గతంలో డ్రగ్స్ కేసు సమయంలో ముమైత్ ఖాన్‌ను నిర్వాహకుల అనుమతితో పోలీసులు విచారణకు పిలిచారు. మరి బాబు గోగినేని విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

English Title
FIR filed against Babu Gogineni for hurting religious sentiments

MORE FROM AUTHOR

RELATED ARTICLES