భారీ కుంభకోణంతో ఫేస్‌బుక్ కుదేలు

భారీ కుంభకోణంతో ఫేస్‌బుక్ కుదేలు
x
Highlights

మీ ఫేస్ బుక్ ఎకౌంట్ సేఫేనా... సరదాగా మీరు షేర్ చేసే మీ వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రం... ఫేస్ బుక్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే...

మీ ఫేస్ బుక్ ఎకౌంట్ సేఫేనా... సరదాగా మీరు షేర్ చేసే మీ వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రం... ఫేస్ బుక్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే బుక్కైపోయినట్టేనా...? అవును ఇప్పుడు ఫేస్ బుక్ ఇరుక్కున్న స్కాం చూస్తే ఇలాంటి అనుమానాలు రాకతప్పదు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. అతి పెద్ద కుంభకోణంలో చిక్కుకుంది. ఆర్ధికంగా తీవ్ర నష్టాలబాట పట్టడంతోపాటు సంస్థ విశ్వసనీయత భారీగా దెబ్బతినే ప్రమాదం వచ్చిపడింది.

ఫేస్‌బుక్‌ అంటే ఒక నమ్మకం. సంస్థ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్‌ వ్యక్తిత్వం, సేవా దృక్ఫథంతోపాటు సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు వినియోగదారులకు ఎనలేని విశ్వాసాన్ని కల్పించాయి. అందుకే ఎంతో విలువైన తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టేందుకు వెనుకాడరు. కానీ ఇప్పుడు ఆ విశ్వసనీయతే ప్రమాదంలో పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం 5 కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం లీకయినట్లు వచ్చిన ఆరోపణలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కోసం పనిచేసిన ‘‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’’ సంస్థకు దాదాపు ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాల సమాచారం చిక్కిందనేది ప్రధాన ఆరోపణ. వీటిపై స్పందిస్తూ అనలిటికా ఖాతాను ఫేస్‌బుక్‌ స్తంభింపచేసింది. ఈ లీక్‌పై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అమెరికా సహా అట్లాంటిక్‌ మహాసముద్రానికి రెండు వైపునున్న దేశాల నుంచీ డిమాండ్లు వస్తున్నాయి.

అమెరికా కాంగ్రెస్‌ ఎదుట గూగుల్‌, ట్విటర్‌ సీఈవోలతో సహా హాజరుకావాలని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు అమెరికా డెమోక్రటిక్‌ సెనేటర్‌ అమీ క్లోబుచార్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ జాన్‌ కెన్నడీ సూచించారు. మరోవైపు సమాచార దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీ కూడా జుకెర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. ఈ దారుణ వైఫల్యంపై సంజాయిషీ ఇవ్వాలని జుకెర్‌బర్గ్‌ను కోరినట్లు ప్రతినిధుల సభలోని డిజిటల్‌, సంస్కృతి, మీడియా, క్రీడలు వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌తోపాటు కేంబ్రిడ్జ్‌ అనలిటికాపైనా సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ ఎలిజబెత్‌ డెన్‌హామ్‌ వెల్లడించారు. కేంబ్రిడ్జ్‌ అనలిటికా రికార్డుల పరిశీలనకు సహకరించట్లేదని ఆమె తెలిపారు. సంస్థ సర్వర్లను జల్లెడ పట్టేందుకు కోర్టు అనుమతి తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. ఐరోపా సమాఖ్య.. ఈయూ పార్లమెంటు పౌర హక్కుల కమిటీ కూడా తమ ఎదుట ఫేస్‌బుక్‌ ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించింది.

మరోవైపు అసలు లీక్‌ ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఓ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సంస్థను ఫేస్‌బుక్‌ నియమించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే మార్క్ జుకర్ బర్గ్ దాదాపు 500 కోట్ల డాలర్ల మేర నష్టపోయారు. సోమవారం నాటికి 6.8 శాతం మేర నాస్‌డాక్‌లో నష్టపోయిన సంస్థ షేర్లు మంగళవారం, బుధవారం ఉదయం కూడా అదే బాటపట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories