కోటలో కొనసాగుతున్న వేట

కోటలో కొనసాగుతున్న వేట
x
Highlights

కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో...

కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జరుపుతున్న తవ్వకాల తీరుతో అందరి దృష్టి తవ్వకాలపైనే పడింది. చారిత్రక, ప్రాచీన కట్టడాలను కాపాడాల్సిన అధికారులు పోలీసులే గుప్త నిధుల కోసం రహస్య తవ్వకాలకు వత్తాసు పలికి అండగా నిలపడడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవతోంది. విజయనగర రాజుల కాలంలో కట్టిన కోటలో పెద్ద పెద్ద మందు పాతరలతో రాతిగుండ్లను బద్దలు కొడుతూ తవ్వకాలు జరుపుతున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లె గ్రామంలో ఉన్న కోట అంతర్బాగంలో ప్రాచీనమైన దేవాలయం ఉంది. పాడుబడిన ఈ కోటలో నిధులు నిక్షేపాలు ఉన్నాయన్న ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా సాగుతోంది. దీంతో తవ్వకాలకు అంతులేకుండా పోతోంది. అధికారులే తవ్వకాలకు సిద్ధమవడమే కాదు రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగిస్తుండటాన్ని చెన్నెంపల్లి గ్రామస్తులు వ్యతిరేకించారు. తవ్వకాలకు అనుమతి ఏదంటూ పత్రాలు చూపించాలంటూ అడ్డం తిరిగారు. దీంతో దిగివచ్చిన జిల్లా యంత్రాంగం గ్రామస్తులతో చర్చించి దొరికిన నిధుల నుంచి 20 శాతం గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని హామినివ్వడంతో తవ్వకాలకు ఊరి ప్రజల అనుమతి లభించినట్టయింది.

చెన్నంపల్లి కోటలో అసలేం జరుగుతోంది? ఎవరి అనుమతితో ప్రాచీన కోటలో తవ్వకాలు జరుపుతున్నారు? ఇదీ ప్రజల సందేహమే కాదు ప్రతిపక్షాల ప్రశ్న కూడా. వైసీపీ ఎమ్మెల్యేల బృందం చెన్నంపల్లి వెళ్లి అధికారులను నిలదీసింది. అయినా అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో కర్నూలు కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. అధికారులే అక్రమ తవ్వకాలు జరపడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.

ఆరు రోజులుగా భారీ బందోబస్తు మధ్య పురాతన కోటలో జరుగుతున్న తవ్వకాలపై పురావస్తు శాఖకు గాని చరిత్రకారులకు గాని మైన్స్ అండ్ జియాలజీకి గాని ఎలాంటి సమాచారం లేదన్న మాట వాస్తవం. ఇదే విషయంపై కలెక్టర్‌ను వైసీపీ ఎమ్మెల్యేల బృందం గట్టిగా నిలదీయడంతో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం మరింత ముదిరింది. పెద్ద రాతి గుండు కింద సొరంగంలా కనిపిస్తున్న మార్గంలో తవ్వకాలు జరుపగా ఇవాళ పెద్ద పెద్ద ఎముకలు గారతో కూడిన ఇటుకలు బయటపడ్డాయి. దీంతో తవ్వకాలపై ఉత్కంఠ ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories