టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి...సాదర స్వాగతం పలికిన కేటీఆర్‌

Submitted by arun on Fri, 09/07/2018 - 12:47
Suresh Reddy

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ స్పీకర్  కే.ఆర్ సురేష్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లోని సురేష్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్‌ భేటి అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలంటూ కేటీఆర్ ఆహ్వానించారు.  ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు వివేక్‌తో పాటు జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ సురేష్‌రెడ్డికి తమ పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తామన్నారు.   

తెలంగాణ కోసం తొలి నుంచి పోరాడిన టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు సురేష్ రెడ్డి ప్రకటించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ప్రస్తుత సమయంలో సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని ఇందుకోసమే టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నానని ఆయన అన్నారు. 2004లో కాంగ్రెస్‌ తరపున బాల్కొండ నుంచి గెలిచిన సురేష్‌రెడ్డి స్పీకర్‌గా వ్యవహారించారు. అనంతరం జరిగిన 2009, 2014  ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్‌లో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదంటూ గత కొద్ది కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరినట్టు భావిస్తున్నారు. 

సురేష్ రెడ్డి చేరికతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ రద్దు అయిన రెండో రోజు నుంచే టీఆర్‌ఎస్ రెండో విడత ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది.  కాంగ్రెస్ ముఖ్య నేతలకు వల వేస్తున్న అధిష్టానం టీఆర్ఎస్‌లోకి రావాలంటూ ఆహ్వానిస్తోంది. ఇప్పటికే  పలువురు కాంగ్రెస్‌  సీనియర్లు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు విడతల వారిగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు.  

ఇప్పటికే జిల్లాల వారిగా ప్రముఖ నేతల జాబితా సిద్ధం చేసుకున్న అధి నాయకత్వం .. పార్టీ ముఖ్యనేతలకు ఈ బాధ్యత అప్పగించినట్టు సమాచారం. మాజీ మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోని అసంతృప్తులతో పాటు జనాధరణ ఉన్న వారే లక్ష్యంగా రెండో విడత ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్టు సమాచారం.   

English Title
Ex Speaker Suresh Reddy Joins in TRS

MORE FROM AUTHOR

RELATED ARTICLES