రాజ్యసభలో మరోసారి అధికార, విపక్షాలు ఢీ...డిప్యూటీ చైర్మన్ పదవి కోసం పోటా పోటీ వ్యూహాలు

Submitted by arun on Tue, 08/07/2018 - 11:02

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నగారా మోగింది. ఎల్లుండి జరిగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. తగిన సంఖ్యాబలం లేకపోయినా..కీలక పదవిని దక్కించుకోవడానికి అధికార ఎన్డీఏ వ్యూహాలు రచిస్తోంది. పీజే. కురియన్ పదవీకాలం ముగియడంతో ఖాళీ అయిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి గురువారం ఎన్నిక నిర్వహిస్తున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. ఇంతకాలం యూపీఏ చేతిలో ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే పెద్దల సభలో బీజేపీ అతిపెద్దగా పార్టీగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడం ఇబ్బందిగా మారింది. బిజూ జనతాదళ్, టీఆర్ఎస్ , అన్నాడీఎంకే, శివసేన మద్దతు కీలకంగా మారింది. 

245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో 122 మంది సభ్యుల మద్దతు ఉంటేనే డిప్యూటీ చైర్మన్ పదవి వరిస్తుంది. అన్నాడీఎంకే సభ్యులతో కలిపి ఎన్డీయేకు రాజ్యసభలో 106 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. భారతీయ జనతాపార్టీకి సొంతంగా బలం లేకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో బీజేడీ, టీఆర్ఎస్ పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి కమలదళం పావులు కదుపుతోంది. బీజేపీ సొంత అభ్యర్థిని నిలబెడితే ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వడం కష్టమవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ఎన్డీయేలోని తరుఫున అభ్యర్థిని నిలపాలనేది కమలదళం ఆలోచనగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థిగా జనతాదల్ యునైటెడ్ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరును బీజేపీ పరిశీలిస్తోంది.  

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు రావడంతో ఆ పార్టీ మద్దతు విపక్షానికే దక్కనుంది. టీడీపీకి ఉన్న ఆరుగురు సభ్యులతో కలిపి రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 117కు చేరింది. దీంతో 122 మ్యాజిక్ ఫిగర్‌కు మరో ఐదుగురు సభ్యుల మద్దతు కూడగడితే బీజేపీపై గెలవొచ్చన్న ధీమాతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా  వ్యూహాలు రచిస్తోంది. అయితే ప్రతిపక్షాల తరపున అభ్యర్థి ఎవరనే విషయం ఇప్పటి వరకూ చర్చకు రాలేదు. అయితే విపక్షాల తరపున తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిని సుఖేందర్ రాయ్ ని బరిలోకి దించాలనే ఆలోచనలో విపక్ష పార్టీలున్నట్లు సమాచారం. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలుచున్నా వారికి మద్దతు తెలుపడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హస్తం నేతలు బీజేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూ తరపున ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్‌ని బరిలోకి దించితే అనుకున్న మెజార్టీ సమీకరించలేని పక్షంలో ప్రత్యామ్నాయంగా అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్‌ను నిలబెట్టాలని బీజేపీ యోచిస్తోంది. నరేష్ గుజ్రాల్ అయితే టీడీపీ మద్దతు కూడా సంపాదించవచ్చనే ధీమాలో ఉంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల తరపున ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టినప్పటికీ వారికి మద్దతు ఇవ్వకూడదని ఇప్పటికే వైఎస్సార్ పార్టీ ప్రకటించింది. దాంతో ఆ పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి జరిగే ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

English Title
Election to Deputy Chairman Rajya Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES