అదృష్టంతో అందలం.. పేలవ ప్రదర్శనతో నిష్క్రమణం! సన్ రైజర్స్ ఆటతీరిదీ..

అదృష్టంతో అందలం.. పేలవ ప్రదర్శనతో నిష్క్రమణం!    సన్ రైజర్స్ ఆటతీరిదీ..
x
Highlights

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే అదృష్టం తోనే ప్లేఆఫ్ వరకూ రాగలిగింది. ఆ అదృష్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది....

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే అదృష్టం తోనే ప్లేఆఫ్ వరకూ రాగలిగింది. ఆ అదృష్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. బ్యాటింగ్ లో మెరిసిన సన్ రైజర్స్ బౌలింగ్ లో మాత్రం కుదేలయిపోయింది. దాదాపు టోర్నీ అంతా సన్ రైజర్స్ కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా.. పడుతూ లేస్తూ ముందుకు సాగింది.

మొదట్లో సూపర్ అనిపించారు..

డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో ఓపెనింగ్‌ జోడీ అద్భుతమైన ఓపెనింగ్ బ్యాటింగ్ తో మొదట్లో వారెవ్వా అనిపించింది సన్ రైజర్స్. ఆ టీముతో ఆట అంటే ఓపెనర్లను పడగొట్టకపోతే కష్టం అని ప్రత్యర్థులు అనుకునేలా సన్ రైజర్స్ టోర్నిలో శుభారంభాన్ని చేసింది. ఆ ఊపు చూసిన అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఆ ఓపెనర్ల జోడి ఎంత ప్రభావవంతంగా ఆడిందంటే.. వార్నర్‌ ఆడిన 12 మ్యాచుల్లో 69.20 సగటుతో 692 పరుగులు చేసి మధ్యలోనే జట్టుకు దూరమైనా ఇంతవరకూ మరే బ్యాట్స్‌మెన్‌ తన రికార్డును తాకలేనంతగా దూసుకెళ్లాడు. 143.86 స్ట్రైక్‌ రేట్‌ తో ఎనిమిది అర్ధశతకాలు, ఒక శతకం బాదేసి సన్ రైజర్స్ కు ఊపు తెచ్చాడు. మరోవైపు తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో కూడా 10 మ్యాచుల్లో 55.62సగటుతో రెండు అర్ధశతకాలు ఒక శతకం సహాయంతో 445 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చాలు వారిద్దరి ఓపెనింగ్ జోడీ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి. వీరిద్దరి విజృంభణతో మొదటి నాలుగు మ్యాచుల్లో మూడిటిని గెలుచుకుని కప్ రేసులో తానున్నానని సంకేతాలు పంపింది. అయితే, సన్ రైజర్స్ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. ఏ ఒక్కరిద్దరి మీదో ఆధారపడితే కొంప ఎలా కోల్లెరవుతుందో తెలిసొచ్చింది. డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో ఇద్దరు టోర్నీ నుంచి తప్పుకోవడంతో సన్ రైజర్స్ చతికిలపడింది. బ్యాటింగ్లో అక్కరకొస్తారనుకున్న వారంతా చేతులేత్తేశారు.

కథ అడ్డం తిరిగింది


మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో సన్‌ రైజర్స్‌ ఈసారి కూడా టైటిల్‌ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరికలు చేసింది. వార్నర్‌, బెయిర్‌ జోరు చూస్తే అందరికీ అదే నిజమనిపించింది. అయితే, వార్నర్‌, బెయిర్‌ స్టో స్వదేశానికి వెళ్లడంతో సన్‌ రైజర్స్‌ కథ అడ్డం తిరిగింది. ఉన్నట్టుండి సన్‌ రైజర్స్‌ ఒక్కసారిగా చతికిలపడింది. వాళ్లిద్దరి గైర్హాజరీలో ఆఖరి ఐదు మ్యాచుల్లో సన్‌ రైజర్స్‌ నాలుగు పరాజయాలు చవి చూసింది. 12 పాయింట్లు మాత్రమే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ సహాయంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ చేరుకున్న జట్టుగా సన్‌ రైజర్స్‌ రికార్డు సృష్టించింది. కీలకమైన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది.

కీలకం అనుకున్నవాళ్లు చేతులెత్తేశారు

గతేడాది ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న విలియమ్సన్‌ గాయంతో దదాపు సగం మ్యాచులు ఆడలేదు. . ఆడిన మ్యాచుల్లోను నిలకడైన బ్యాట్స్‌మెన్‌గా పేరున్న విలియమ్సన్‌ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒక మ్యాచులో 70 పరుగులు తప్పిస్తే అతని వల్ల జట్టుకు ఒరిగిందేమీ లేకుండా పోయింది. నాలుగో స్థానం కోసం జట్టులోకి తీసుకున్న తమిళనాడు ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రపంచకప్‌ జట్టులోనూ స్థానం సంపాదించిన ఇతగాడు 14 మ్యాచులాడి 20.33సగటు మాత్రమే పరుగులు చేశాడంటే ఎంత విఫలమయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఇక జట్టులో కీలకమైన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉంటాడనుకున్న మనీశ్‌ పాండే సైతం తొలి ఐదు మ్యాచుల్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఆఖరులో ఆరు మ్యాచుల్లో మూడు అర్ధశతకాలు బాది తానున్నానని చెప్పుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నిలకడ లేమికి కేరాఫ్..

సన్ రైజర్స్ జట్టు నిలకడ లేమికి కేరాఫ్ గా మారిపోయింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచి, 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. వార్నర్‌, బెయిర్‌ స్టో కలిసి 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారా మ్యాచులో. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌ రైజర్స్‌ 96 పరుగులకే చాపచుట్టేసి చెడు గుర్తును వేసుకుంది.

కొంప మునిగింది బౌలర్లతోనే..

2016లో ఛాంపియన్‌, 2018లో రన్నరప్‌గా ఉన్న సన్‌ రైజర్స్‌ 2019లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. దృఢమైన బౌలింగ్‌ జట్టుగా పేరున్న ఆ జట్టులో ఈసారి బౌలర్లంతా విఫలమయ్యారు. గతంలో రాణించిన సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, థంపీ కనీసం వాళ్ల స్థానాలు కూడా కాపాడుకోలేకపోయారు. దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌లూ ఏమి తిసిపోలేదు. నిజానికి బౌలర్లను ఉపయోగించుకోవడంలో విలియమ్సన్ పూర్తిగా విఫలమయ్యాడు. పదిహేను మ్యాచులు ఆది తోమ్మిదిటిలో ఓడి.. ఆరిటిలో గెలిచి తన ప్రస్థానాన్ని ముగించింది. అన్నట్టు ఈ క్రమంలో 12 పాయింట్లతో ప్లేఆఫ్ కు చేరిన తొలి జట్టుగా చెప్పుకోలేని అదృష్టపు రికార్డును సన్ రైజర్స్ నెలకొల్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories