దేవుడిని నమ్ముతాను.. కానీ వారిని నమ్మను : రాంగోపాల్ వర్మ

దేవుడిని నమ్ముతాను.. కానీ వారిని నమ్మను : రాంగోపాల్ వర్మ
x
Highlights

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఊహకందని ఎమోషన్స్ ఉంటాయంటున్నారు సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎన్నో వివాదాల...

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఊహకందని ఎమోషన్స్ ఉంటాయంటున్నారు సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎన్నో వివాదాల మధ్య వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. వాస్తవానికి వర్మ ఏడాది క్రితమే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో అలజడి రేపారు.. బయోపిక్ తీయడమంటే మామూలు విషయం కాదు.. కథాంశాన్ని తీసుకునే తీరు దానిని సినిమాగా మలిచే తీరులోనే ఉంటుంది వర్మ స్పెషాలిటీ.. గతంలో ముంబై దాడులపైనా, కిల్లర్ వీరప్పన్ పైనా వర్మ తీసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..

విజయవాడలో ఆధిపత్య కుల రాజకీయాలపై వర్మ తీసిన సినిమాయే వంగవీటి సినిమా. ఈ సినిమాపై అప్పట్లోనే వివాదాలు రేగాయి. వంగవీటి రంగా వ్యక్తిత్వాన్ని సరిగా ప్రొజెక్ట్ చేయలేదంటూ అప్పట్లో రంగా అనుచరులు వర్మపై కేసులు కూడా పెట్టారు.. ఇలా నిత్యం సంచలనాలు లేనిదే వర్మ కెరీర్ లేదు.. మరిప్పుడు అలాంటి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానంటున్నారు.

ఎన్టీఆర్ జీవితమే సంచలనాల మయం.. రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోవడమే అప్పట్లో పెద్ద సంచలనం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వీరిద్దరి మధ్య ఎమోషన్స్ ని ఎలా చూపించబోతున్నారు? బయటకు రాని నిజాలుంటాయన్నారు.. అంటే అప్పటి రాజకీయ క్రీడలో జరిగిన వైస్రాయ్ ఎపిసోడ్, అధికార మార్పిడి, ఎన్టీఆర్ రాజకీయ పతనం అన్నీ వర్మ చూపిస్తారా? చూపిస్తే వాటిని ఎవరినీ నొప్పించకుండా చూపగలరా? ఇప్పుడు అందరినీ ఇవే సందేహాలు వేధిస్తున్నాయి.

బాలయ్య తీస్తున్న బయోపిక్ మూవీ వేగం పెరగడమే కారణమా? అదీకాక హటాత్తుగా ఆలయ సందర్శన ఎందుకు? తిరుమల వెంకన్న చుట్టూ అల్లిన కథ గోవిందా, గోవిందా మూవీ షూటింగ్ లోనే వర్మ కనీసం ఒక్క సారి కూడా దైవ దర్శనం చేసుకోలేదు.. అలాంటిది ఇప్పుడు గుళ్లకు వెళ్లడం ఎందుకు?వర్మ మారిపోయారా? నాస్తికుడినుంచి ఆస్తికుడిగా మారిపోయారా?

ఉరుము లేని మెరుపులా తిరుపతిలో ఊడి పడ్డారు.. తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు.. అదే టైమ్ లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా తిరుమల వచ్చారు.. వీరిద్దరూ అనుకునే వచ్చారా, లేక కాకతాళీయమా అన్నది తెలియకపోయినా.. వర్మ సినిమాపై ఆసక్తిని కనపరిచారు లక్ష్మీ పార్వతి.

దేవుడిని నమ్మని రాం గోపాల్ వర్మ కాణీపాకం వరసిద్ధి వినాయకుడినీ, తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తెల్లని వస్త్రాలు ధరించి లడ్డూ ప్రసాదం చేతబూనీ కనిపించారు.ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవంతోనే తొలిసారి శ్రీవారిని దర్శించుకున్నానని వర్మ చెప్పారు. దేవుడిని నమ్ముతాను.. కానీ భక్తుడిని నమ్మనంటూనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నిజాలనే చూపిస్తానని రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు.

చిత్రంలో పాత్రలకు నప్పే వ్యక్తులను ఎంపిక చేయడంలో కూడా వర్మ దిట్టే.. ఇటీవల ఓ హోటల్ లో పనిచేస్తున్న ప్రభు త్రయంబకేశ్వర్ అనే ఓ సర్వర్ విజువల్స్ వాట్సప్ లో హల్ చల్ చేశాయి. చంద్రబాబును పోలినట్లున్న ఆ వ్యక్తి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానని వర్మ ప్రకటించారు. చివరకు ముత్యాల రోహిత్ అనే యువకుడు ఈ వివరాలు వర్మకు చేరవేయడంతో ఆ నగదు పారితోషికం అతడికి పంపించారు వర్మ.
మొత్తం మీద అటు బాలయ్య, ఇటు వర్మ ఎవరికి వారు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తుండటంతో ఎవరి సినిమా ఎలా ఉంటుందనే ఉత్సుకత మాత్రం అందరిలోనూ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories