అవిశ్వాసంతో మోడీ సర్కారుకి నష్టమా..అవిశ్వాసానికి కలసి వచ్చే పార్టీలెన్ని...?

x
Highlights

ఏపీలో ఇప్పుడు చర్చంతా అవిశ్వాస తీర్మానం చుట్టూ తిరుగుతోంది. విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ...

ఏపీలో ఇప్పుడు చర్చంతా అవిశ్వాస తీర్మానం చుట్టూ తిరుగుతోంది. విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ దాదాపు ముక్త కంఠంతో అంటున్నాయి. దీని వల్ల ఏపీకి వచ్చేదేమిటి..? మోడీ సర్కారుకి పోయేదేమిటి..? అసలు అవిశ్వాస తీర్మానం లెక్కలు ఏంటి..? నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఏమవుతుంది..?

ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వంపై అవి‌శ్వాసం పెడతామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారో లేదో...దాదాపు అన్ని ప్రధాన పార్టీలు సై అంటే సై అన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 5 నుంచి జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అవి‌శ్వాస తీర్మానం తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

నిజానికి అవి‌శ్వాస తీర్మానాన్ని ఒక్క ఎంపీ అయినా ప్రవేశపెట్టొచ్చు. అయితే తర్వాత దానికి 50 మంది ఎంపీల మద్దతు పలకాలి...అప్పుడే దానిని పరిగణణలోకి తీసుకుంటారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే...మొదట లోక్‌సభలో రూల్‌ 198 ప్రకారం లిఖిత పూర్వక నోటీసు ఇవ్వాలి. తర్వాత దానిని స్పీకర్‌ సభలో చదివి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో తెలుసుకుంటారు. 50 మందికి పైగా సభ్యులు తీర్మానానికి మద్దతు పలికితే ఒక రోజును తీర్మానంపై చర్చకు నిర్ణయిస్తారు. తర్వాత ఓటింగ్‌ ఉంటుంది. ఒకవేళ ఓటింగ్‌లో అవిశ్వాన తీర్మానానికి ఎక్కువ ఓట్లు వస్తే... కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడం అంత సులభం కాదు. ఎందుకంటే..లోక్‌సభ ఉన్న 543 స్థానాలకు గానూ అధికార పార్టీకి 272 మంది బలముంటే సరిపోతుంది. ఎన్డీయేలోని అతిపెద్ద పార్టీ బీజేపీకి 272 మంది సభ్యుల బలంతో పాటు స్పీకర్‌ ఉన్నారు. మొత్తంగా ఎన్డీయే కూటమికి 330 మంది ఎంపీలున్నారు. పైగా అన్నాడీఎంకే..పాటు మరి కొన్ని పక్షాలు బయటనుంచి మద్దతు ఇస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 25 మంది సభ్యులుంటే...అందులో ఇద్దరు బీజేపీ ఎంపీలు. మిగతా 23 మందిలో 15 మంది టీడీపీ 8 మంది వైసీపీ సభ్యులు. మరి వైసీపీ కానీ , టీడీపీ కానీ , లోక్సభలో 48 మంది ఎంపీలున్న కాంగ్రెస్ కానీ అవి‌‌శ్వాస తీర్మానం పెడితే ఎన్ని పార్టీలు మద్దతిస్తాయనేదే ఆసక్తికరంగా మారింది.

గతంలో వాజ్ పాయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇలానే అవి‌‌శ్వాసం ఎదుర్కొని కుప్పకూలిపోయింది. 1998లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 13 నెలల తర్వాత 1999లో అవి‌‌శ్వాసం ఎదుర్కొంది. నాటి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్ పాయి ప్రభుత్వం 1999 ఏప్రిల్ 17న విశ్వాసం ఎదుర్కొంది. చివరికి ఒక్క ఓటు తేడాతో వాజ్ పాయి ప్రభుత్వం ఓడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories