భారత్‌కు రావాలనుకుంటున్న దావూద్

Submitted by arun on Wed, 03/07/2018 - 12:37
dawood ibrahim

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ కొన్ని షరతులు వర్తిస్తాయంటూ తన తరఫు న్యాయవాది ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాడు. కేసు విచారణ సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అర్థర్ రోడ్ జైలులో తనను ఉంచుతానంటేనే లొంగిపోతానని దావూద్ తెలియజేసినట్టు ఆయన సోదరుడు ఇక్బాల్ కస్కర్ కేసును వాదిస్తోన్న లాయర్ శ్యామ్ కేశ్వాని తెలిపారు. అయితే ఈ షరతులకు ప్రభుత్వం నిరాకరించింది. 

మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తిరిగి భారత్‌కు రావాలనుకుంటున్నాడు. అయితే, తనను ముంబయిలో పటిష్ట భద్రత ఉండే ఆర్థూర్‌ రోడ్డు సెంట్రల్‌ జైలులో మాత్రమే ఉంచాలని దావూద్‌ కోరుకుంటున్నాడు. దావూద్ తన షరతుల గురించి చాలా సంవత్సరాల కిందటే సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినా, దీనికి అంగీకరించలేదని లాయర్ శ్యామ్ కేశ్వాని తెలిపారు. 

ఆర్థర్ రోడ్డు జైలులో ముంబయి మారణహోమంలో కీలక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను నాలుగేళ్ల పాటు ఉంచి, 2012లో ఉరితీశారు. దావూద్ మోడీ ప్రభుత్వంతో చర్చలు జరిపారని, ఆయన భారత్‌కు తిరిగొస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నారని, భారత్‌లోనే తుది శ్వాస విడవాలని భావిస్తున్నారని అన్నారు.

మరోవైపు దోపిడీ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్‌ను థానె పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్‌వీ థమదేకర్ ఎదుట మంగళవారం హాజరు పరిచారు. మిరా రోడ్ బిల్డర్‌ను బెదిరించిన కేసులో కస్కర్, ఆయన సోదరుడు దావూద్, అనీస్‌లపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. కోర్టుకు హాజరైన కస్కర్‌ను సోదరుడు దావూద్, ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

అయితే తనకు తెలియదని చెప్పిన కస్కర్.. ఇటీవల దావూద్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలియజేశాడు. అయితే మొబైల్ నెంబరు డిస్‌ప్లే కాలేదని, అతడెక్కడున్నదీ తాను తెలుసుకోలేకపోతున్నానని న్యాయమూర్తికి తెలిపాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కస్కర్‌ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది.

English Title
‘Dawood Ibrahim said he’d return if kept in Arthur Road jail’

MORE FROM AUTHOR

RELATED ARTICLES