చోటా రాజన్‌ను చంపేందుకు దావూద్‌ కుట్ర

Submitted by arun on Wed, 12/27/2017 - 15:26
Dawood Ibrahim

ముంబయి అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం.. సహచరుడు చోటా రాజన్‌ను తిహార్‌ జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం. దాంతో తిహార్‌ జైలులో భద్రత పెంచాల్సిందిగా జైలు అధికారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఢిల్లీలో టాప్ గ్యాంగ్ స్టర్ అయిన నీరజ్ భావన సహచరుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ నీరజ్‌కు అనుబంధం ఉన్న అతను కూడా ఓ చిన్నపాటి ముఠా నాయకుడే. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు. అతన్ని విచారించిన పోలీసులకు ఈ విషయం తెలిసింది. తాగిన మైకంలో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఈ అంశాలను పోలీసులు గుర్తించారు.

దాదాపు 20 ఏళ్ల నుంచి చోటా రాజన్‌ను హత్య చేయాలని డీ గ్యాంగ్ ప్లాన్ వేస్తోంది. దీని కోసం ఆ గ్యాంగ్ తీహార్ జైలులో శిక్ష పొందుతున్న బవానాను కూడా కలిసింది. చోటా రాజన్, నీరజ్ బవానాలు ఒకే జైలులో ఉండేవారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఇద్దర్ని వేరు చేశారు. గ్యాంగ్‌స్టర్ బవానా జైలు రూమ్‌లో కొన్ని మొబైల్ ఫోన్లను కూడా ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే జైలు అధికారులు మాత్రం దావూద్ గ్యాంగ్ ప్రయత్నాలను కొట్టిపారేస్తున్నారు. బవానా కానీ డీ గ్యాంగ్ కానీ చోటా రాజన్‌ను చేరలేరని జైలు అధికారులు చెప్పారు. రాజన్ కోసం జైలులో ప్రత్యేకంగా స్పెషల్ గార్డ్స్ ఉన్నారు. అతని భద్రత కోసం ప్రత్యేకంగా వంటచేసేవారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

English Title
Dawood Ibrahim planning to kill Chhota Rajan

MORE FROM AUTHOR

RELATED ARTICLES