నేడు తీరం దాటనున్న ‘గజ’

నేడు తీరం దాటనున్న ‘గజ’
x
Highlights

గజ తుపాను ఇవాళ తీరం దాటనుందని, ఏడు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. గజ తుపాను ప్రస్తుతం చెన్నై నుంచి 490, నాగై...

గజ తుపాను ఇవాళ తీరం దాటనుందని, ఏడు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. గజ తుపాను ప్రస్తుతం చెన్నై నుంచి 490, నాగై నుంచి 580 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత ఆరు గంటల్లోనే 10 కిలో మీటర్ల వేగంతో కదులుతూ మరింత బలపడుతోందని, ఇవాళ సాయంత్రం కడలూరు- పాంబన్‌ మధ్య తీరం దాటుతుందని తెలిపారు. అప్పుడు కడలూరు, నాగపట్టణం, కారైక్కాల్‌, తిరువారూరు, తంజావూరు, పుదుకోట, రామనాథపురం జిల్లాలలో గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని, మిగిలిన జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. చెన్నైలో మాత్రం రానున్న మూడు రోజులు మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

కడలూరు, నాగై తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు సహాయ చర్యల్లో విపత్తు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుపాను కారణంగా కడలూరు, నాగై, తిరువారూరు, రామనాథపురం, పుదుకోట, కారైక్కాల్‌ జిల్లాల్లోని పాఠశాల, కళాశాలలకు ఇవాళ సెలవు ప్రకటించినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు.

మరోవైపు గజ తుపాను తీరం దాటే వరకు సముద్రతీరాలకు ప్రజలు వెళ్లకూడదని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. కారైక్కాల్‌లో తుపాను ముందస్తు చర్యల గురించి అధికారులతో అతిథిగృహంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పుదుచ్చేరి, కారైక్కాలలో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పుదుచ్చేరి నుంచి విపత్తు సహాయ బృందాలు కారైక్కాల్‌కి వెళ్లాయన్నారు. కారైక్కాల్‌లో అధికారులందరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తీరప్రాంతాలలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాల్లోని పాఠశాల, కమ్యూనిటీ హాళ్లకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి అవసరమయ్యే ఆహారం, తాగునీరు తదితర వసతులు కల్పిస్తున్నామని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories