ముంచుకొస్తున్న ఫోని తుపాను..దిశ మార్చుకుని

ముంచుకొస్తున్న ఫోని తుపాను..దిశ మార్చుకుని
x
Highlights

ఫోని తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఈనెల 30, మే 1వ తేదీల్లో దిశను మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా దిశగా కదిలే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. తీవ్ర...

ఫోని తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఈనెల 30, మే 1వ తేదీల్లో దిశను మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా దిశగా కదిలే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. తీవ్ర తుపానుగా మారిన 'ఫొని' 30న అతి తీవ్రంగా, మే 1న పెను తుపానుగా మారనుంది. మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేయనుంది. అయితే ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది వాతావరణశాఖ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. నిన్న సాయంత్రం వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫొని తుపాను ట్రింకోమలీకి 630 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 910 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1090 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది.

అయితే, మే 1వ తేదీ నాటికి పెను తుపానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా ప్రయాణించే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆ సమయంలో గాలుల వేగం 150 కి.మీ. నుంచి 185 కి.మీ. వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కేరళలో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. అలాగే మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, ఒడిశా తీరంలో భారీ వర్షాలకూ అవకాశమున్నట్లు వివరించారు.

రేపు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరంలో గంటకు 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆ తర్వాత మే 2న ఏపీ, ఒడిశా తీరాల్లో గంటకు 40-60 కి.మీ, 3న ఒడిశా తీరంలో 50-70 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని చెబుతున్నారు. రేపు ఇది మరింత తీవ్రంగా మారుతుందని అంటున్నారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories