కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు...ఉత్తమ్‌కి వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్తోన్న వ్యతిరేక వర్గం

Submitted by arun on Tue, 06/19/2018 - 12:00

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గాంధీభవన్‌ వేదికగా ఒక వర్గం... సీఎల్పీ వేదికగా మరో వర్గం వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని చెబుతోన్న తెలంగాణ కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ముఖ్య నేతల మధ్య ఒక్కొక్కటిగా అభిప్రాయ భేదాలు బహిర్గతమవుతుంటే జిల్లాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్లూ అంతర్గతంగా సాగిన ఆధిపత్య పోరు, కుమ్ములాటలు ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతుండటంతో కేడర్‌ అయోమయంలో పడుతోంది.

ఒకే అంశంపై గాంధీభవన్‌లో ఒక వర్గం‌ సీఎల్పీలో మరో వర్గం ప్రెస్‌మీట్లు పెట్టడం టీకాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. గాంధీభవన్‌ వేదికగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రెస్‌మీట్‌లు పెడుతుంటే సీఎల్పీ వేదికగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఇతర ముఖ్యనేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు ఉత్తమ్‌ వ్యతిరేక వర్గం సీఎల్పీ వేదికగా బహిరంగ హెచ్చరికలు పంపుతోందనే చర్చ పార్టీలో నడుస్తోంది.

టీపీసీసీ ముఖ్య నేతల వ్యవహారశైలి వల్లే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్లు అంటున్నారు. పీసీసీ చీఫ్‌‌ ఏకపక్ష నిర్ణయాలే దీనికి కారణమని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ఉత్తమ్‌ సీనియర్లను కలుపుకొని పోవడం లేదని, ప్రెస్‌మీట్లకు కూడా పిలవకుండా మోనార్క్‌గా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఉత్తమ్‌కి వ్యతిరేకంగా పలువురు సీనియర్లు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీకి బర్త్‌డే విషెస్‌ చెప్పేందుకే ఢిల్లీ వెళ్తున్నామని పైకి చెబుతున్నా ఉత్తమ్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకేననే టాక్ వినిపిస్తోంది. మరి ఈ పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

English Title
Congress Senior Leaders Unsatisfied With Uttam Kumar Reddy Self Decisions

MORE FROM AUTHOR

RELATED ARTICLES