ఏపీకి ప్రత్యేక హోదాపై ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానం

ఏపీకి ప్రత్యేక హోదాపై ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నట్లు.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో జరుగుతున్న రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో దీనిపై ఆ పార్టీ...

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నట్లు.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో జరుగుతున్న రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో దీనిపై ఆ పార్టీ రాజకీయ తీర్మానం చేసింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ప్రత్యేక హోదాను ఇప్పటివరకు ఇవ్వకపోవడాన్ని ఖండించిన పార్టీ.. విభజన చట్టాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.

రాహుల్‌గాంధీ అధ్యక్షతన తొలిసారిగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సమావేశాల్లో.. ఏపీకి ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నట్లు.. రాజకీయ తీర్మానం చేశారు. విభజన సమయంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు సిద్దమని తీర్మానంలో పేర్కొన్నారు. తాము అధికారంలోకొచ్చాక.. ఏపీకిచ్చిన హామీలన్నింటినీ అమలుచేస్తామంటూ తీర్మానం చేశారు.

2014 ఫిబ్రవరి 20 న ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటించారంటూ.. తీర్మానంలో కాంగ్రెస్ పేర్కొంది. అయితే తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. ఆ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ.. విభజన చట్టంలోని హామీలన్ని ఎన్డీయే ప్రభుత్వం విస్మరించిందని అగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీకి ప్రత్యేక హోదా న్యాయమైన కోరిక అని.. కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. మంచి పనుల కోసం శత్రువులనైనా కలుపుపోవాలంటూ సమావేశాల్లో ఓ కవిత పాడి వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని.. మోడీ ప్రభుత్వంపై ఏపీ పార్టీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాలకు తమ మద్దతుంటుందని.. ఖర్గే స్పష్టం చేశారు.

మరోవైపు రాహుల్ ని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని.. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంటకరెడ్డి అన్నారు. రాహుల్ దిశానిర్దేశం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. 2019 లో కేంద్రంతో పాటు.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు.

దేశం అభివృద్ధిపధంలో నడవాలంటే.. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.. ఏపీకి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు. దేశంలోని ప్రస్తుత సమస్యల పరిష్కారం దిశగా పలు తీర్మానాలు చేయనున్నామని.. రాహుల్ నాయకత్వంలో ఏపీలో అధికారంలోకొస్తామని.. భరోసా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రజలంతా అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని.. దేశాన్ని ముందుకు నడిపించేది చేయి గుర్తేనని ఈ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన రాహుల్ గాంధీ అన్నారు. ఇటు ఈ సమావేశాల్లోనే 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వివిధ తీర్మానాలను ఆమోదించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories