కాక మీదున్నా కాంగ్రెస్ నేతలు.. రెబల్స్ గా బరిలో

కాక మీదున్నా కాంగ్రెస్ నేతలు.. రెబల్స్ గా బరిలో
x
Highlights

కాంగ్రెస్ నేతలు కాక మీదున్నారు. సీట్లు దక్కకపోవడంతో అసంతప్తితో రగిలిపోతున్నారు. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండిచ్చింది. మహాకూటమి...

కాంగ్రెస్ నేతలు కాక మీదున్నారు. సీట్లు దక్కకపోవడంతో అసంతప్తితో రగిలిపోతున్నారు. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండిచ్చింది. మహాకూటమి అభ్యర్థులకు పోటీగా రెబల్స్ గా బరిలో నిలిచేందుకు నేతలు సిద్ధమయ్యారు. నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం పెద్దలను రంగంలోకి దించబోతుంది. మహాకూటమితో జోరుమీదున్న కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కూటమి పొత్తులో పలువురి కాంగ్రెస్ నేతల సీట్లు గల్లంతయ్యాయి. చివరి వరకు టికెట్ వస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. సీటు దక్కించుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. తమ వారికి సీట్లు కేటాయించుకోవడంలో విఫలమైన నేతలు నైరాశ్యంలో ఉన్నారు.

సీటు దక్కని కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సనత్ నగర్ సీటు తనకే దక్కుతుందనుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి అధిష్టానం చెయ్యిచ్చింది. సనత్ నగర్ సీటును టీడీపీకి కేటాయించింది. ఇక్కడ్నుంచి కూన వెంకటేశ్‌గౌడ్‌ను ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని శశిధర్ రెడ్డి కుటుంబం ఉంది. ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వరకు అన్నీ ఆయనే చూశారు.

పార్టీలో సీనియర్ నేత, అన్ని కార్యక్రమాల్లో ముందున్న మర్రి శశిధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో అనుచరులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కొందరి టికెట్ ఇచ్చి ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన తమనేతకు టికెట్ ఇవ్వరా.? అంటూ శశిధర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు సీటు కేటాయించకపోవడంతో మర్రి శశిధర్ రెడ్డి కలత చెందారు. మూడో జాబితాలో తన పేరు లేకపోవడం బాధాకరమన్నారు. తన ప్రత్యామ్నాయ మార్గాలు తనకున్నాయని చెప్పారు. పార్టీ పెద్దలు మర్రికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీటు దక్కకపోవడంతో తన అనుచరులతో మాట్లాడి నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు మర్రి.

రెబల్స్ బెడదతో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సీటు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానం పెద్దలతో ఫోన్లో మాట్లాడించి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మెత్తబడని నేతలు రెబల్స్ గా పోటీ చేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే రెబల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీట్లు రాని నేతలనంతా ఏకం చేసి ఒకే గుర్తుపై పోటీ చేస్తామని ప్రకటించారు. మహాకూటమి అభ్యర్థులకు పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.

సీట్లు రాని నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి నేతలను రంగంలోకి దించుతున్నారు. బుజ్జగింపుల కమిటీ రెండు రోజుల్లో హైదరాబాద్ రానుంది. సీట్లు రాని నేతలను పిలిపించి వారిని బుజ్జగించనుంది. రెబల్స్ గా తప్పుకోవాలని పార్టీలో తగిన గుర్తింపు కల్పిస్తామని చెప్పనుంది. అధిష్టానం ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories