కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గుట్టు విప్పిన రేవంత్‌రెడ్డి

Submitted by arun on Mon, 03/05/2018 - 18:05
third front

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గుట్టును విప్పారు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి. ఇంతకాలం ప్రజా సమస్యలు చూడనట్టు ఇప్పుడే తన దృష్టికి వచ్చినట్టు రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తున్నారని రేవంత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఆయన ఆడుతున్న కొత్త డ్రామా అని, ఈ తెర వెనుక భాగోతాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు రేవంత్‌‌రెడ్డి.

యూపీఏ హయాంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు సీబీఐ కేసుల భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి. ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణ కుంభకోణాలు, సహారా ఇండియా కంపెనీ వేల కోట్ల కుంభకోణం కేసుల వ్యవహారంపై విచారణ జరుగుతోందని, ఈ రెండు కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం కోసం సీబీఐ ప్రయత్నిస్తోందని చెప్పారు.  

రాష్ట్ర విభజన హామీలు నెరవేరకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు మోడీ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారన్నారు రేవంత్. బీజేపీ నుంచి బయటకొస్తే కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి సిద్ధమని ఆయన సంకేతాలిచ్చారన్నారు. దీంతో చంద్రబాబు భవిష్యత్ ప్రణాళిక కాంగ్రెస్‌తో అని నాగ్‌పూర్ పెద్దలు మోడీకి నివేదిక ఇచ్చారని, అందువల్లే నాగ్‌పూర్ వేదికగా థర్డ్ ఫ్రంట్ వ్యవహారం నడుస్తోందన్నారు. కేసీఆర్ థర్డ్ ఫ‌్రంట్‌పై పవన్‌కల్యాణ్, అసదుద్దీన్‌ ఒవైసీ ఆహో, ఒహో అంటూ భజన చేస్తున్నారని, నాగ్‌పూర్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ మాత్రమేనని ఆయన చెప్పారు. 

గతంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ను నోటికొచ్చినట్టు దూషించిన కేటీఆర్ తన ట్వీట్స్‌ను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా తన లక్ష్యం నెరవేరలేదన్నారు. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగాడని చెప్పారు రేవంత్. కంటి, పంటి వైద్యం పేరుతో వైద్యం చేయించుకున్నట్టు రాష్ట్ర ప్రజల్లో భ్రమలు కల్పించారని మండిపడ్డారు. వీరి కోర్కెలను ఢిల్లీ పెద్దలు మన్నించలేదని, దీంతో థర్డ్ ఫ‌్రంట్ అంటూ కొత్త డ్రామా మొదలెట్టారని ఆయన విమర్శించారు. 

కేసీఆర్ కుటుంబంలో గొడవలు పరాకాష్టకు చేరాయన్న రేవంత్ గతంలో హరీశ్ ఫ్రంట్, కేటీఆర్ ఫ్రంట్ ఉంటే ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ సంతోష్‌రావు అని చెప్పారు. ఇక తెలంగాణలో ఆదివాసీలు, లంబాల మధ్య చిచ్చుపెట్టి ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారంలో మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు టీఆర్‌ఎస్‌తో టీడీపీ కలిసే ప్రసక్తే లేదని, చంద్రబాబుకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చెప్పారు. బడ్జెట్ సమావేశాల తర్వాత నుంచి ఎన్డీయేలో లుకలుకలు మొదలయ్యాయని, దీంతో మోడీకి పరోక్షంగా సహకరించేందుకు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ హంగామా మొదలెట్టాడని తేల్చేశారు రేవంత్‌. మరి కేసీఆర్ కొత్త డ్రామా.. ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి. 

English Title
Congress leader Revanth Reddy Fire on cm kcr

MORE FROM AUTHOR

RELATED ARTICLES