అమ్మ కోసం...తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు....

Submitted by arun on Fri, 08/24/2018 - 10:10
Rahul, Sonia

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అమ్మ జపం చేస్తున్నారు. ఈసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు టీకాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నారు. ఉత్తర తెలంగాణలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సోనియా వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందనే సెంటిమెంట్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌కు ధీటుగా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించేందుకు టీకాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ముందస్తు ఎన్నికల హడావిడితో తెలంగాణ సెంటిమెంట్‌నే అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించిన ఉత్తర తెలంగాణ గడ్డ నుంచే సోనియాగాంధీతో సభ నిర్వహించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇచ్చిన తెలంగాణలో పాలన ఎలా ఉందో సోనియా ద్వారానే ప్రకటించడానికి టీకాంగ్రెస్‌ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

ఉత్తర తెలంగాణలో 42 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్‌ కేవలం మూడంటే మూడు సీట్లే గెలుచుకుంది. అయితే ఈసారి నార్త్ తెలంగాణలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటోన్న టీకాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌ రెడీ చేసుకుంటోంది. వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో బస్సు యాత్రతో పుంజుకోవాలని భావిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా సోనియా, రాహుల్‌ను ఆహ్వానించి భారీ బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటున్నారు. ఒక సభకు సోనియాను, మరో సభకు రాహుల్‌ను తీసుకురావాలని చూస్తున్నారు. అంతేకాదు సోనియా వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందనే సెంటిమెంట్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. సోనియాగాంధీ వస్తేనే తెలంగాణ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందని లెక్కలేసుకుంటున్న టీకాంగ్రెస్‌ లీడర్లు కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌లో ఏదో ఒక చోట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కంకణం కట్టుకున్నారు. సోనియా, రాహుల్‌ వస్తే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడం ఖాయమని భావిస్తున్నారు. మరి టీకాంగ్రెస్‌ వ్యూహం వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.

English Title
Congress to focus on Telangana election; Rahul, Sonia to visit state

MORE FROM AUTHOR

RELATED ARTICLES