అటు నామినేషన్లు.. ఇటు బుజ్జగింపులు..

అటు నామినేషన్లు.. ఇటు బుజ్జగింపులు..
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ హ‌డావుడి తారాస్థాయికి చేరుకుంది. టిక్కెట్లు రానివారంతా క‌వ్వింపు చ‌ర్య‌లకు దిగుతున్నారు. అసంతృప్తుల్లో చాలామంది...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ హ‌డావుడి తారాస్థాయికి చేరుకుంది. టిక్కెట్లు రానివారంతా క‌వ్వింపు చ‌ర్య‌లకు దిగుతున్నారు. అసంతృప్తుల్లో చాలామంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగుతామంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో హుటాహుటిని వీరంద‌రినీ బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం రంగంలోకి దిగింది. శ‌నివారం రాత్రి మొద‌లైన ఈ బుజ్జ‌గింపులు ఇంకా కొనసాగుతున్నాయి. హైద‌రాబాద్ లోని పార్క్ హాయ‌త్ హోట‌ల్ ఈ బుజ్జగింపుల‌కు వేదిక‌గా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతప్తుల సంఖ్య పెరుగుతుండడంతో అధిష్టానం అలెర్ట్ అయింది. అసంతృప్తులను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వారిని బుజ్జగించేందుకు ముగ్గురిని రంగంలో దించింది. పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, క‌ర్ణాట‌క మంత్రి డీకే శివ‌కుమార్‌, యానాం నుంచి కృష్ణారావు అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురు నేత‌లూ ఒక్కో అసంతృప్త నాయ‌కుడితో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌ుతున్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని అసంతృప్త నాయకులకు హామీ ఇస్తున్నారు. పార్టీలో భ‌విష్య‌త్తుపై న‌మ్మ‌కం ఇవ్వ‌డం, వివిధ మార్గాల ద్వారా ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌నే భ‌రోసా క‌ల్పించడం వంటి హామీల ద్వారా రెబెల్స్, స్వ‌తంత్రుల‌ను పోటీ నుంచి విర‌మింప‌జేసే ప్ర‌య‌త్నం ఈ క‌మిటీ చేస్తోంది. అదే విధంగా ఈ అసంతృప్త నాయ‌కుల‌ను ఆయా నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల‌తో మాట్లాడించి, రెబెల్స్ ను కూడా క‌లుపుకుని ప్రచారంలో ముందుకు సాగే వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ కృషి చేస్తోంది.


తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకులైన పొన్నాల లక్ష్మయ్య, వీ. హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి నేతలతో పాటు టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నాయకులంతా బుజ్జగింపుల కమిటీ ముందు హాజరై తమ వాదనను వినిపించారు. ఇదిలా ఉంటే సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. సనత్‌నగర్ నుంచి స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించారు. కావాలంటే టీడీపీకి సికింద్రాబాద్ సీటును కేటాయించవచ్చని, తాను మాత్రం సికింద్రాబాద్ నుంచి పోటీచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓ వైపు గులాబీ బాస్ కేసీఆర్ జెట్ వేగంతో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమౌతుంటే కాంగ్రెస్ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమౌతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories