ఒకే దెబ్బకు...మూడు పిట్టలు

ఒకే దెబ్బకు...మూడు పిట్టలు
x
Highlights

ముందస్తు ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్‌ కొత్త అస్త్రాలను ప్రయోగించబోతోందా ? అధికార పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అస్త్రాలుగా వాడుకునేందుకు రెడీ...

ముందస్తు ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్‌ కొత్త అస్త్రాలను ప్రయోగించబోతోందా ? అధికార పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అస్త్రాలుగా వాడుకునేందుకు రెడీ అవుతోందా ? పాత ఎన్‌కౌంటర్‌ తెరపైకి తెచ్చి గులాబీ బాస్‌ను ఇరుకున పెట్టడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోందా ? ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ అస్త్రాలేంటీ ?

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. సోషల్ మీడియాలోనూ బహిరంగంగా టీఆర్ఎస్‌కు మాటకు మాట బదులిస్తోంది. మేనిఫెస్టోలో విస్మరించిన హామీలను తెరమీదకు తెచ్చి పోరుబాట పడుతోంది. ప్రధానంగా మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు రిజర్వేషన్ అంశాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 12శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆందోళన బాట పడుతోంది.

కాంగ్రెస్‌ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న ముస్లింలు గత ఎన్నికల్లో దూరమయ్యారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి వారికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా 12శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని ఎత్తిచూపుతూ టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇస్తామన్న రిజర్వేషన్లు ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తోంది. గాంధీభ‌వ‌న్ నుంచి అబిడ్స్ జ‌న‌ర‌ల్ పోస్టాఫీస్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించి ప‌న్నెండు వేల పోస్టుకార్డుల‌ను సీఎం కేసీఆర్‌కు పోస్ట్ చేశారు.

12 శాతం రిజ‌ర్వేష‌న్లపై టీఆర్‌ఎస్‌ను ఎంఐఎం ప్ర‌శ్నించ‌కపోవడాన్ని తప్పు పట్టడం ద్వారా ఎంఐఎంను ఇరుకున పెడుతోంది. టీఆర్ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లేనంటూ మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ అండదండలతో బలపడ్డ ఎంఐఎం కేసీఆర్‌తో దోస్టీ కట్టి కాంగ్రెస్‌కు ద్రోహం చేసిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంఐఎం అభ్య‌ర్థుల‌పై బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెడ‌తామ‌ని చెబుతున్నారు. పనిలో పనిగా వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ను తెరమీదకు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణ ఏమైందంటూ ఉత్తమ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ముస్లింల రిజర్వేషన్లు, వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్లలాగే కొత్త అంశాలతో అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టేందుకు టీ కాంగ్రెస్‌ రెడీ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories