కడప జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు...పార్టీ పరువును బజారుకీడ్చుతున్న నేతలు

Submitted by arun on Mon, 06/11/2018 - 12:29

కడప జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయ్. ఏ నియోజకవర్గంలో చూసినా నేతల మధ్య పొసగడం లేదు. వ్యక్తిగత దూషణలకు దిగి...పార్టీ పరువును బజారుకీడ్చుతున్నారు. నేతల మధ్య సమన్వయం లోపించడంతో...పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది. జిల్లాపై పట్టు సాధించాలని చంద్రబాబు ప్లాన్‌ వేస్తుంటే...నేతలు మాత్రం గొడవలతో బజారున పడుతున్నారు. 

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలతో పాటు కేడర్‌ ఉంది. అయితే కేడర్‌ను నడిపించే నాయకులు వ్యక్తిగత గొడవలతో పార్టీని బజారుపాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు...అధికార కేంద్రాలుగా మారారు. సమష్టిగా పని చేసి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాల్సిన నేతలే...ప్రతిపక్షం నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా...నేతలు రెండు వర్గాలుగా విడిపోతున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రైల్వే కోడూరులలో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 

ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ప్రస్తుత ఇన్‌చార్జ్‌ వరదరాజులురెడ్డిలు....రెండు వర్గాలుగా విడిపోయారు. అధికార పార్టీ నేతలే...ఒకరిపై ఒకరు బుదర జల్లుకుంటూ పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. కుందూ, పెన్నా నది వరద కాలువల పనుల వ్యవహారం...నేతల మధ్య విభేదాలుగా ప్రధాన కారణంగా మారాయ్. ఇదే సమయంలో ఎంపీ సీఎం రమేశ్‌‌పై వరదరాజులురెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేని రమేశ్‌‌కు...గ్రూపు రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలను...ఓడిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్‌తో సీఎం రమేష్ టచ్‌లో ఉన్నారని మరో బాంబ్ పేల్చారు. 

జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య వర్గపోరు కొన్నేళ్లుగా ఉంది. కొంతకాలం కలిసిమెలసి ఉన్నట్లు కనిపించినా...ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. పెద్దదండ్లూరులో మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు...రామసుబ్బారెడ్డి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవ కాస్తా...ఆది వర్సెస్‌ రామసుబ్బారెడ్డిగా మారింది. బద్వేలులో పార్టీ పటిష్టమైన కేడర్ ఉన్నప్పటికీ...ఎమ్మెల్యే జయరాములు టీడీపీ నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, జయరాములు మధ్య గొడవ ఉప్పునిప్పులా ఉంది. రాయచోటిలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు మధ్య సఖ్యత కొరవడింది. రైల్వేకోడూరులో మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, ఇన్‌చార్జ్‌ విశ్వనాథనాయుడు మధ్య పచ్చిగడ్డి వేస్తే మనేలా తయారైంది. 

ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు...నేతల మధ్య విభేదాలను పరిష్కరించడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య వంతులను చేయాల్సిన నేతలు...వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. దీంతో బలమైన కేడరున్నప్పటికీ...పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. ఎన్నికలకు మరో ఏడాది గడువుండటంతో...విభేదాలు పక్కన పెట్టి పని చేయకపోతే కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. 

English Title
Conflicts Between TDP Leaders In Kadapa District

MORE FROM AUTHOR

RELATED ARTICLES