నేతల్లో సర్వే టెన్షన్‌.... వారికి టికెట్లు గల్లంతే...

Submitted by arun on Wed, 07/04/2018 - 10:47

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే రెండు సర్వేలు చేయించిన గులాబీ బాస్‌ తాజాగా మూడోసారి సర్వే చేయించారు. అయితే ఈ సర్వేలో ఎమ్మెల్యేల పనితీరు మెరుగయినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మందికి సర్వే వివరాలను నేరుగా అందజేస్తే మరి కొంత మందికి రిపోర్ట్‌లో ఏముందోనన్న టెన్షన్‌ మొదలైంది. 

ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో గులాబీ దళపతి పార్టీ గెలుపోటములపై మూడోసారి సర్వే చేయించారు. రైతుబంధు, రైతు భీమా తర్వాత నిర్వహించిన సర్వేలో ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది. ప్రభుత్వ పథకాలపై ఏమనుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. సమస్యలు ఉంటే ఎమ్మెల్యేలు పరిష్కరిస్తున్నారా అనే అంశాలను సర్వేలో తెలుసుకున్నారు కేసీఆర్‌. తాజా సర్వేలో ఎమ్మెల్యేల పని తీరు చాలా మెరుగుపడినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుకు 55 నుంచి 60 మార్కులు వస్తే ప్రభుత్వ పనితీరుపై మాత్రం 70 నుంచి 75 శాతం వరకు మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. 

గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశం పెట్టి అందరి రిపోర్ట్‌లు ఇస్తారని ఎమ్మెల్యేలంతా ఆందోళన పడ్డారు. అయితే ఈ సారి ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని ప్రగతి భవన్‌కు పిలిపించి సర్వే రిపోర్ట్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సర్వే నివేదికలను వారికి ఇచ్చినట్లు సమాచారం.  నివేదికలు ఇస్తూనే భవిష్యత్‌లో ఏం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల రిపోర్ట్‌లను ప్రగతి భవన్‌లోనే ఇవ్వనున్నారు. బహిరంగంగా నివేదికలు ఇవ్వడంతో మీడియా హైలెట్‌ చేసింది. దీంతో తక్కువ మార్కులు వచ్చిన నియోజకవర్గాల్లో అనవసరపు చర్చకు దారి తీస్తుందని రిపోర్ట్ రహస్యంగా ఇవ్వడం మంచిదని  గులాబీ బాస్‌ భావిస్తున్నారు.  గతంలో కంటే ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పడుతుందని రిపోర్ట్‌లో తేలినా కొంత మంది పనితీరు అధ్వాన్నంగా ఉన్నట్లు సర్వేలో తేలితే టికెట్లు గల్లంతేనని వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయ్. 


 

English Title
CM KCR's 3rd time survey on performance of MLAs create Tension in TRS leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES