టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన కేసీఆర్

Submitted by arun on Fri, 09/07/2018 - 08:59

అసెంబ్లీ రద్దయ్యిందో లేదో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్...ఎన్నికల వ్యూహాలు రచించడంలో మునిగిపోయారు. 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 

నిన్న శాసన సభ రద్దు చేసిన వెంటనే... 105 మంది శాసన సభ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్..వెంటనే కార్యాచరణలోకి దిగిపోయారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. నవంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అభ్యర్థులు వెంటనే వారి వారి నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. పార్టీ చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి ఊరు, తండాలను వదలకుండా పర్యటనలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

ఎమ్మెల్యే టికెట్‌ వచ్చిందని గర్వపడొద్దని హితవు పలికిన కేసీఆర్ నియోజక వర్గంలోని అన్నిస్థాయిల నేతలను కలుపుకోవాలని సూచించారు. అసంతృప్తి నేతలుంటే ఎమ్మెల్యే అభ్యర్థులే బుజ్జగించాలని సూచించారు. ప్రతీ నియోజక వర్గానికి వస్తానని, ఒక్కో రోజు రెండు మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని దాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను అందజేస్తుందని చెప్పారు. ఇప్పటివరకు చేసింది, చేయబోయేవి అన్నీ మేనిఫెస్టోలో చెబుతామని అన్నారు. మరో సమావేశంలో కలుద్దామని అభ్యర్థులకు కేసీఆర్‌ చెప్పారు. 

మరోవైపు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని కేసీఆర్ ప్రకటించారు. ఎంపీ కే కేశవరావు చైర్మన్ గా ఉన్న మేనిఫెస్టో కమిటీలో.. జితేందర్ రెడ్డి, జి.నగేష్, ఈటల రాజేందర్, టి.హరీష్ రావు, జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, అజ్మీర చందూలాల్, టి. పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫరీదుద్దీన్, పి.రాములు, గుండు సుధారాణి సభ్యులుగా ఉన్నారు.

English Title
CM KCR Winning Strategies For Pre Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES