అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారు...

Submitted by arun on Wed, 09/05/2018 - 09:34

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైందా..? ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు సడుతున్నాయా..? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. రేపు ఉదయం ఆరున్నరకి జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది. శాసనసభ రద్దుకు కౌంట్‌డౌన్‌ మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. రేపు ఉదయం ఆరున్నర ప్రాంతంలో మంత్రివర్గం సమావేశమై అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకం ప్రకారం రేపు ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని, ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్‌ భేటీకి సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రేపు ఉదయం ఆరున్నరకి తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఈ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఉదయం 6.45 లేదంటే.. 7.15 సమయంలో రద్దు నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం ఆరుగంటల నుంచి అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు సూచించినట్లు తెలిసింది. అసెంబ్లీ రద్దుకు కేబినెట్‌లో తీర్మానం ఆమోదించాక వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి మంత్రిమండలి సిఫారసును గవర్నర్‌ నరసింహన్‌కు అందజేస్తారు. దాంతో బంతి గవర్నర్‌ కోర్టుకు చేరుతుంది. తిథి, వార, నక్షత్ర, తారాబలాన్ని చూసుకుని అత్యంత అనుకూలంగా భావించే గురు-పుష్య యోగంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

శాసనసభ రద్దుకు ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో నిన్నటి పరిణామాలు ఆసక్తి రేపాయి. ఉన్నతస్థాయి ప్రభుత్వ యంత్రాంగం అంతా నిన్నంతా ఈ అంశంపై కసరత్తు చేసింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి, సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి నరసింగరావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నిన్న మధ్యాహ్నం గవర్నర్‌తో సమావేశమయ్యారు. తర్వాత ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మంత్రివర్గ సమావేశానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలిసింది. డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా సాంకేతిక ఇబ్బందులేవీ లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులకు సూచించారు. మరోవైపు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కూడా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషితో సమావేశమయ్యారు. మరోవైపు ఇవాళ తెలంగాణ ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుండటం విశేషం

మరోవైపు అసెంబ్లీ రద్దు మూహూర్తం ఖరారు చేసుకున్న గులాబీ బాస్ ..అంతే మెరుపు వ్యూహంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు. లక్షలాది మందితో ప్రగతి నివేదన సభ నిర్వహించిన కొద్ది రోజులకే హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్లు రేపు శాసనసభ రద్దు ప్రకటన వెలువడితే ముఖ్యమంత్రి శుక్రవారం హుస్నాబాద్‌ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఆ రోజు నుంచి సుమారు 100 సభల్లో పాల్గొంటారు. 

English Title
CM KCR Will Ready to Go For Pre Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES