సభ రద్దు సంప్రదాయాలపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు...అనుకున్న సమయానికి కొత్త సర్కార్ ఏర్పడేలా వ్యూహ‍ం

Submitted by arun on Thu, 09/06/2018 - 09:32

అసెంబ్లీ రద్దుకు సమాయత్తమవుతున్న కేసీఆర్ ఆ ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేశారు. శాసన సభను ఏ పద్ధతిలో రద్దు చేయాలి..? అసెంబ్లీ రద్దుకు ఏయే కారణాలను చూపాలి..? అసెంబ్లీ రద్దుపై కోర్టు చిక్కులు ఎదురు కాకుండా ఏం చేయాలనే అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ మంతనాలు జరిపారు.  

తెలంగాణ శాసనసభ రద్దుపై సీఎం కేసీఆర్ పక్కాగా కసరత్తు చేశారు. ముఖ్య అధికారులతో సమావేశమై అసెంబ్లీ రద్దు ప్రక్రియపై మంతనాలు జరిపారు. అధికారిక సమాచారం ప్రకారం అసెంబ్లీ రద్దు కోసం కేసీఆర్ మూడు రకాల సాంప్రదాయాలను పరిశీలిచారు. మొదటిది శాసనసభను రద్దు చేస్తున్నట్టు కేబినెట్ తీర్మానం చేయడం. రెండోది సర్క్యులేషన్  పద్ధతిలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోవడం అంటే అసెంబ్లీ రద్దుకు సంబంధించి మంత్రులకు విడివిడిగా నోట్ జారీ చేసి వారి సంతకాలు చేసుకోవడం. ఇక మూడో పద్ధతి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో రద్దు ప్రకటన చేయడం. ఇలా అసెంబ్లీ రద్దు కోసం 3 రకాల పద్ధతులను పరిశీలించిన కేసీఆర్ మొదటి విధానం పట్లే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అంటే అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ చేత ఏకవాక్య తీర్మానం చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అసెంబ్లీ రద్దు సాధ్యాసాధ్యాలు, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలపై కేసీఆర్ కొద్ది రోజులుగా పలువురు ఉన్నతాధికారులు, కీలక నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ రద్దుకు ఏయే కారణాలను చూపాలనే అంశంపైనా కసరత్తు చేశారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలను రద్దు చేసిన సీఎంలు ఏ ఏ కారణాలు చూపారు తాము ఏ కారణం చెబితే బాగుంటుందనే అంశాలపై సమాలోచనలు చేశారు. అలాగే కోర్టుల నుంచి ఎదురయ్యే చిక్కులపైనా కేసీఆర్ దృష్టి సారించారు. ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేస్తే.. కొందరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చర్యలు తీసుకొంటున్నారు. మొత్తానికి నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణలోనూ ఎన్నికలు జరిగి డిసెంబర్ 15 లోపు కొత్త సర్కార్ కొలువుతీరేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. 

English Title
CM KCR Strategy For Assembly Dissolve

MORE FROM AUTHOR

RELATED ARTICLES