రాష్ర్టాలకు స్వేచ్ఛనివ్వాలి

Submitted by arun on Mon, 06/18/2018 - 10:28
kcr

నీతి అయోగ్ పాలక మండలి సమావేశంలో మొత్తం 7 అంశాలను ప్రస్థావించారు తెలంగాణ సీఎం కేసీఆర్.  తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి వివరించారు. వ్యవసాయరంగ సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్...దేశాభివృద్ధికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రాష్ట్రంలో 98శాతం మంది సన్న,చిన్నకారు రైతులున్నారని, అన్నదాతలను ఆదుకునేందుకు రైతుబంధు పేరుతో ఎకరాకు 4వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. 

వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తిచేశామని చెప్పారు కేసీఆర్. 17రకాల సెక్యూరిటీ ఫీచర్లతో 50లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేసినట్లు ఆయన తెలిపారు.  భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా గ్రామీణ ప్రాంత భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత వచ్చిందని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. 

తెలంగాణలోని 24 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగనుందని, మెగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నామని చెప్పారు.  రాష్ర్టాల అభివృద్ధిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు ఎక్కువ నిధులు ఇవ్వలేని పక్షంలో పన్ను రాయితీలు కల్పించాలని కోరారు.  

అలాగే, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన డెయిరీ, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలని, ఆయా రంగాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు కేసీఆర్. రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యల్లో భాగంగా  ఉపాధీ హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాలని కోరారు కేసీఆర్. ఇక విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలపై కేంద్రం మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్...  విద్య, వైద్యం, నగరీకరణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో రాష్ర్టాలకు మరింత స్వేచ్ఛనివ్వాలని కేంద్రానికి సూచించారు. 

English Title
cm kcr speech at niti aayog meeting

MORE FROM AUTHOR

RELATED ARTICLES