మెదక్‌ నుంచి రంగంలోకి హరీష్‌రావు‌

Submitted by arun on Tue, 04/03/2018 - 11:34
kcr

వచ్చే ఎన్నికలపై కన్నేసిన తెలంగాణ సీఎం... బహుముఖ వ్యూహాలకు తెరలేపారు. హస్తినలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని అంచనా వేస్తున్నారు కేసీఆర్‌.  ఎలాగైనా మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఢిల్లీ చక్రం తిప్పాలన్నది ఆయన ఆలోచన. అందుకు అనుగుణంగా పక్కాగా పావులు కదుపుతున్నారు. 

తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని సీట్లను గెలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కేసీఆర్‌. అందులో భాగంగా పలువరు మంత్రులను ఎంపీలుగా పోటీ చేయించాలనుకుంటున్నారు. అందుకే సీనియర్ మంత్రులందరిని లోక్‌సభలో పోటి చేయించడమే మార్గమని నమ్ముతున్నారు. తద్వారా ఎంపీ సీట్లతో పాటు ఆ పార్లమెంట్  స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా సీనియర్ మంత్రులను పార్లమెంట్‌కు పంపిచే ఏర్పాట్లు చేస్తున్నారు. 

మంత్రి హరీష్‌రావును మెదక్ పార్లమెంట్‌ నుంచి పోటీకి దింపాలని చూస్తున్నారు. హరీష్‌కు క్లీన్ ఇమేజ్ ఉండటం ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడంతో మెదక్ ఎంపీగా ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందన్నది కేసీఆర్ నమ్మకం. అందుకే ఆయన్ను ఒప్పించి మెదక్ ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం గులాబీ పార్టీలో నడుస్తోంది. 

ఇక ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ను కరీంనగర్ ఎంపీగా పోటీకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి బీసీ ఫేస్‌గా ఉన్నారు ఈటల. ఆయన్ను ఎంపీగా ఎలివేట్ చేయడం ద్వారా బీసీల ఓట్లు రాబట్టుకోవాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారు. అందుకే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఆయన సతీమణి జమునకు అవకాశం ఇచ్చి కరీంనగర్ ఎంపీగా ఈటలను పంపవచ్చంటున్నారు. 

డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరిని మరోసారి ఢిల్లీకి పంపించాలనుకుంటున్నారు. ఖమ్మం నుంచి తుమ్మలను, నిజమాబాద్ ఎంపీగా మంత్రి పోచారంను, నల్గొండ ఎంపీగా మంత్రి జగదీష్‌రెడ్డిని, పోటీ చేయిస్తే ఏలా ఉంటుందని సీఎం యోచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిని చేవెళ్ల నుంచి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటి చేయాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. కానీ తలసాని మాత్రం తాను ఎంపీగా వెళ్తే.. స్థానిక ప్రజలకు దూరం అవుతానని ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం. 

English Title
CM KCR to focus on national politics after 2019 elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES