ఓ వైపు బదిలీలు.. మరోవైపు వరాలు

Submitted by arun on Sat, 08/25/2018 - 08:29

ఓ వైపు ముందస్తు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా మరికొన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేలా కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల్లో అర్చకులు, మసీదుల్లో ఇమామ్‌ ల జీతభత్యాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్‌ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణలో పూర్తిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఓ వైపు బదిలీలు మరోవైపు వరాలిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందస్తుకు పరోక్ష సంకేతాలిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా గృహోపయోగ విద్యుత్‌ అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ మెరుగుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. 

ఇటు ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న అర్చకుల జీతభత్యాలపై కూడా కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖ పరిధిలో నిర్వహిస్తున్న ఆలయాల్లో అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నేరుగా ఖజానా నుంచే జీతాలు చెల్లిస్తామన్నారు. అలాగే అర్చకుల పదవీ విరమణ వయస్సును కూడా 58 యేళ్ల నుంచి 65 యేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అలాగే మసీదుల్లో ఇమామ్‌, మౌజమ్‌లకు సెప్టెంబర్‌ ఒకటి నుంచి నెలకు 5 వేల భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అన్ని కులాలకు సంబంధించి ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీటికోసం కోకాపేట్‌, ఘట్‌కేసర్‌, మేడిపల్లి, మేడ్చల్‌, అబ్దుల్లాపూర్‌ మేట్‌, ఇంజాపూర్‌ ప్రాంతాల్లో స్థలాల కేటాయింపుపై సమీక్ష నిర్వహించారు. సంచార కులస్థులకు 10 ఎకరాల స్థలంలో సంచార ఆత్మగౌరవ భవన్‌ను నిర్మిస్తామన్నారు. అన్ని కులాలకు స్థలం, నిధులు కేటాయించినందున వెంటనే భవనాల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించాలని ఆయా శాఖ అధికారులు, మంత్రులు, కులసంఘాలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

English Title
cm kcr announced aatma gaurava bhavans in telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES